హైకోర్టు జడ్జి ఆకుల వెంకటశేషసాయి
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ప్రతి ఒక్కరికీ 'రైట్ టూ లైఫ్' కల్పించడం కోసం దేశంలో వ్యవస్థలు సక్రమంగా పని చేయడానికి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే కారణమనిఎపి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు జడ్జి ఆకుల వెంకటశేషసాయి అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌కు రుణపడి ఉండాలన్నారు. నగరంలో ఆధునికీకరించిన డిఎల్‌ఎస్‌ఎ సమావేశ మందిరాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఆయనతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సిహెచ్.మానవేంద్రనాథ్‌రారు, జస్టిస్ టి.మల్లి కార్జునరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి వెంకటశేషసాయి మాట్లాడారు. అందరికీ న్యాయం జరిగినప్పుడే దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ కూడు, గుడ్డ,గూడు అందుతాయన్నారు. ఆర్థిక, సామాజిక హోదా ఆధారంగా కాకుండా, వారి హక్కుగా న్యాయం జరగాలన్నారు. ఏ భారతీయుడు ఆర్థిక, సామాజిక స్థితి కారణంగా అన్యాయానికి గురి కాకూడదు అని రాజ్యాంగం ఆర్టికల్ 39(ఎ)లో అంబేడ్కర్ పొందుపర్చా రన్నారు. జాతీయ లోక్ అదాలత్, న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు ద్వారా సత్వర న్యాయం సాధ్యం అవుతుందన్నారు. జిల్లా స్థాయిలో న్యాయం కోసం వచ్చే వారికి డిఎల్‌ఎస్‌ఎ ద్వారా అందిస్తున్న సేవల పట్ల డిఎల్‌ఎస్‌ఎ చైర్మన్ సునీత గంధం, కార్యదర్శి కె.ప్రత్యూష కుమారిలను అభినం దించారు. అనంతరం హైకోర్టు జడ్జి జస్టిస్ సిహెచ్. మానవేంద్రనాథ్ రారు మాట్లాడారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల పరిధిలో సత్వర న్యాయం సాధ్యం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మరో హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మల్లికార్జునరావు మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటైందన్నారు. ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం మాట్లా డుతూ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో సత్వర న్యాయం కోసం చర్యలు తీసుకుం టున్నామన్నారు. న్యాయ వ్యవస్థ, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో తల్లి తండ్రులను కోల్పోయిన 9 మంది పిల్లలకు జిల్లా యంత్రాంగం ద్వారా గుర్తించి వారికి రూ.10 లక్షల చొప్పున రూ.90 లక్షలు అందజేస్తున్నామన్నారు. తొలుత జిల్లా కోర్టు ప్రాంగణానికి చేరుకున్న హైకోర్టు న్యాయ మూర్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, తది తరులు ఆహ్వానం పలికారు. అనంతరం పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచారు. న్యాయ మూర్తులు కోర్టు అవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌ఎస్‌ఎ సెక్రటరీ కె.ప్రత్యూషకుమారి, న్యాయ మూర్తులు ఎం.నాగేశ్వరరావు, పిఆర్.రాజీవ్, యుయు.ప్రసాద్, ఎ.గాయత్రిదేవి, ఎస్‌పి సిహెచ్.సుధీర్‌కుమార్, జెసి ఎన్.తేజ్‌భరత్, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జియువిబి.రాజు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.










