Mar 18,2023 23:45

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి పాఠశాల విద్యార్థులకు రాగి మాల్ట్‌ పెట్టాలనే ఆలోచనను స్వాగతిస్తున్నామని అయితే, పిండి మాత్రమే ఇస్తే ఎలా అనే ప్రశ్న మధ్యాహ్న భోజన కార్మికులలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టి ఆకలితీర్చే మధ్యాహ్న భోజన కార్మికులు ఇప్పటికే అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం కొత్త నిర్ణయాలు చేస్తున్నప్పటికీ ఆ దిశగా కేటాయిపులు లేకపోవటం గోరుచుట్టుపై రోకలిపోటులా మారుతోంది. పాఠశాలల సెలవులు మినహా నెలంతా వండి పెట్టినా వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3000 మించి ఇవ్వడం లేదు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 4500 మంది మధ్యాహ్న భోజన కార్మికులు వండి వడ్డిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి వండి పెట్టడానికి అవసరమైన నూనె, పోపు గింజలు, పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలు, వంట చెరుకు తదితర సామగ్రి కోసం రూ.4.97 పైసలు, హైస్కూల్‌ విద్యార్థులకు రూ.7.45 పైసలు ప్రభుత్వం చెల్లిస్తోంది.
భారంగా మారనున్న రాగిమాల్ట్‌ పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేయాలని తెలిపింది. రాగి జావ తయారీ చేసి పంపిణీ చేయాలంటే ఉదయం 7 గంటలకే మిడ్‌డే మీల్స్‌ కార్మికులు స్కూళ్లకు చేరుకోవాలి. ఫలితంగా అదనంగా మరో 3 గంటలు పని భారం పడుతోంది. మధ్యాహ్న భోజనం పథకం అమలుకు కనీసం ప్రాథమిక పాఠశాలలో రూ.15, హైస్కూల్‌ విద్యార్థులకు రూ.20 చెల్లించాలని కార్మికులు కోరుతున్నా ప్రభుత్వం పెడ చెవిన పెడుతోంది. గడిచిన నాలుగేళ్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు సుమారు 50 శాతానికి పైగా ధరలు పెరిగాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 100 గ్రాములు, హైస్కూల్‌ విద్యార్థులకు 150 గ్రాముల చొప్పున బియ్యం సరఫరా చేస్తారు. వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో మూడు రోజులపాటు కోడిగుడ్డు కూడా ఉడికించి ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ఒక్కో విద్యార్థి కోసం ఇచ్చే డబ్బు మాత్రం పెంచడం లేదు. కట్టెల పొయ్యి వాడొద్దని చెబుతూనే ప్రత్యామ్నాయంగా సబ్సిడీపై వంటగ్యాస్‌ అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ పథకం నిర్వహణకు అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్‌ఎంసి కమిటీలు
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న గోరుముద్ద పేరుతో మెనూ మార్పులు చేసింది. ఆ మార్పులు తగినట్లుగా బిల్లులు పెంచలేదు. మరోవైపు ఎస్‌ఎంసి కమిటీలను నియమించింది. ఈ కంపెనీలో రాజకీయ జోక్యం పెరగడంతో మధ్యాహ్న భోజన కార్మికుల ఆక్రమణల తొలగింపులు, పని ప్రదేశాల్లో ఇబ్బందులకు గురి చేయడం సర్వసాధారణంగా మారాయి. నాణ్యత తగ్గినా, కూరలు, పప్పులు సరిపోయినంత ఇవ్వకున్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాథమిక స్థాయి పిల్లలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం వంద గ్రాముల బియ్యం ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల పిల్లలు అల్పాహారం తీసుకునే అలవాటు లేకపోవడం అందుకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మధ్యాహ్న భోజనంపైనే ఆధారపడుతున్నారు. అలాంటి విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న వంద, 150 గ్రాముల బియ్యం సరిపోకపోవడం, అదనంగా ఎస్‌ఎంసి కమిటీ సభ్యులు అక్కడే భోజనం చేయడం ఫలితంగా కొన్నిచోట్ల భోజనం సరిపోవడం లేదు. ప్రభుత్వమే విద్యార్థులకు అవసరమైన బియ్యం సరఫరా చేస్తున్నా హమాలీ చార్జీలు మధ్యాహ్న భోజన కార్మికులే భరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
నెలల తరబడి బకాయిలతో ఆర్థికంగా ఇబ్బందులు
నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పటం లేదు. మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రభుత్వం గ్యాస్‌ సరఫరా చేయాలని, మెస్‌ ఛార్జీలు కాకుండా వంట సరుకులు కూడా సరఫరా చేయాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. మధ్యాహ్న భోజన కార్మికుల్లో చాలామంది అస్తమా, ఎలర్జీలాంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. ప్రభుత్వం వంట గ్యాస్‌ సబ్సిడీపై సరఫరా చేయాలని కొన్నేళ్లుగా కోరుతున్నా సానుకూలంగా స్పందించడం లేదు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి బిల్లులు రాని పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన కార్మికులు ఇంటి నుంచి పెట్టుబడి పెట్టి వండి వడ్డించాల్సి వైస్తోంది. గౌరవ వేతనం మండల విద్యాధికారి ఖాతాలో జమవుతాయి. ఎంఇఒ జిల్లా అధికారులకు బిల్లును పంపగా అక్కడ నుంచి రాష్ట్ర ఫైనాన్స్‌ విభాగానికి వెళ్తాయి. నిధుల లభ్యతనుబట్టి ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ అందితే వీరికి మూడు, నాలుగు నెలలకొకసారి డబ్బు చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వేతనాన్ని పెంచడంతో పాటుగా సరుకుల ఛార్జీలను పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరుతున్నారు.