Oct 06,2023 23:37

నమూనా రాకెట్లనుపరిశీలిస్తున్న అధికారులు

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ప్రారంభ సభలో శీహరికోట ఎస్‌డిఎస్‌సి డిప్యూటీ డైరెక్టర్‌ రఘురామ్‌
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం
రానున్న రోజుల్లో ప్రజలకు అంతరిక్ష పర్యాటకం అందుబాటులోకి రాబోతోందని, అందుకు అనుగుణంగా ఇస్రో పరిశోధనలు, ప్రయోగాలు సాగిస్తోందని శ్రీహరికోట ఎస్‌డిఎస్‌సి డిప్యూటీ డైరెకర్‌ టిఎస్‌.రఘురామ్‌ తెలిపారు. అంతరిక్షానికి అవధి లేదని, ఈ విశ్వం అనంతమని, అపారమని, ఎవరికీ చెందని సంపద ఉందన్నారు. ఈనెల 8 వరకు నిర్వహించనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఇస్రో ఆధ్వర్యాన శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన సబలో ఆయన మాట్లాడారు. ఆత్మ నిర్బర్‌ భారత్‌, స్వాతంత్య్ర అమృతోత్సవం నేపథ్యంలో అంతరిక్ష విజ్ఞానాన్ని ఇంటింటికీ తీసుకెళ్లే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2016 నుంచి అంతరిక్ష వారోత్సవాలను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 'స్పేస్‌ అండ్‌ ఎంటర్ప్రెన్యూర్‌ షిప్‌' పేరుతో అంతరిక్ష వారోత్సవాలు నిర్వమిస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో 9బిలియన్‌ డాలర్ల వ్యాపారం సాగుతుండగా 2047 నాటికి ఇది 70 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. శ్రీహరికోట షార్‌ ఎల్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌. విజయకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజమహేంద్రవరంతో పాటూ విశాఖ, కర్నూలు, శ్రీహరికోటల్లో వారోత్సవాలు చేస్తున్నామన్నారు.
ఇస్రో రాకెట్స్‌ నమూనాల ప్రదర్శన
ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఇస్రో ఆధ్వర్యాన శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌, ప్రైవేట్‌ కాలేజెస్‌ అసోసియేషన్‌, ప్రైవేట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌, ది రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆనం కళాకేంద్రం ఆవరణలో ఇస్రో కార్యకలాపాల వివరాలు, రాకెట్స్‌ నమూనాల ప్రదర్శనను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విసి కె.పద్మరాజు ప్రారంభించారు. శ్రీహరికోట ఎస్‌డిఎస్‌సిడిప్యూటీ డైరెకర్‌ టిఎస్‌.రఘురామ్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ కె దినేష్‌ కుమార్‌, శ్రీహరికోట షార్‌ ఎల్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.విజయకుమార్‌, ఎస్‌డిఎస్‌సి హెడ్‌ లీలా నాగ శ్రీనివాస్‌, రాజమహేంద్రి మహిళా కళాశాల చైర్మన్‌ టి. కె. విశ్వేశ్వర రెడ్డి, పలువురు ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది, ఉప విద్యాశాఖాధికారి నారాయణ, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎస్పీ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు అసలైన లీడర్లుగా ఎదగాలి
విద్యార్థులు అసలైన లీడర్లుగా ఎదగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విసి కె.పద్మరాజు సూచించారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. ఇస్రో ప్రయోగాలతో భారత కీర్తి పతాక రెపరెపలాడుతోందన్నారు. తాజాగా చంద్రయాన్‌ విజయవంతంతో ప్రపంచం అంతా భారత్‌వైపు చూస్తోందన్నారు. ఇస్రో రూపొందించిన బ్రోచర్‌ ని విసి పద్మరాజు ఆవిష్కరించారు.
అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి : కమిషనర్‌
అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌ సూచించారు. ఇప్పుడున్న సౌకర్యాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చంద్రయాన్‌ విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఇస్రో రూపొందించిన పోస్టర్‌ని ఆవిష్కరించారు. అనంతరం అతిథులను సత్కరించారు.