ప్రజాశక్తి - కడియం : నిత్యం వాహనాలతో రద్దీగా వుండే వేమగిరి నుండి సామర్లకోట వెళ్ళు ప్రధానరహదారి (కెనాల్ రోడ్డు) లో పొగ కారణంగా ప్రమాదాలు ఏ రూపంలో సంభవిస్తాయోనని వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వేమగిరి పంచాయతీ వారు స్థానికంగా సేకరించిన చెత్తను వాహనాల ద్వారా తీసుకువచ్చి జి.ఎం.ఆర్ పవర్ ప్రాజెక్ట్ సమీపాన డంప్ చేస్తున్నారు. ఆనక యంత్ర పరికరాలతో ప్రధాన పంటకాలువ ఒడ్డుకు నెట్టేచి, చెత్తకుప్పలకు నిప్పు పెట్టడంతో రహదారి అంతా పొగ వ్యాపించి రాకపోకలు కొనసాగించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి, పగలు, ఉదయం, మధ్యాహ్నం అనే తేడా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు పంచాయతీ కార్మికులు చెత్త కుప్పలకు నిప్పుపెట్టడం చాలా దారుణమని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మొద్దునిద్ర వీడి, సమస్యపై స్పందించి చర్యలు చేపట్టాలని ప్రయాణీకులు, వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.










