Feb 23,2023 22:25

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఫ్యామిలీ ఫిజిషియన్‌ అమలు సాధ్యామేనా. అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం చేసినప్పుడే ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానం విజయవంతం అవుతుంది. త్వరలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలు పని చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గ్రామాల్లో రేయింబవళ్లు ఆరోగ్య కేంద్రాలను తెరచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసి ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే సిబ్బంది కొరత వెంటాడుతోంది. క్షేత్రస్థాయిలో సమస్యలను పట్టించుకోకుండా అమలుకు శ్రీకారం చుట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి
క్షేత్రస్థాయిలో సమస్యలు
జిల్లాలో 32 ఆరోగ్య కేంద్రాలున్నాయి. అందులో 14 ఆరోగ్య కేంద్రాలు 24 గంటలూ పని చేస్తున్నాయి. ఇక్కడ నైట్‌ వాచ్‌మెన్‌, ఆయాలతో సహా విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన పిహెచ్‌సిలు 24 గంటలు సేవలందించేలా త్వరలో చర్యలు తీసుకోనున్నట్టు సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. సరిపడే సిబ్బంది లేకుండా అమలు చేస్తే రాత్రి వేళల్లో విధులు నిర్వహించడం కష్టతరమవుతుందని గుబులు చెందుతున్నారు. ఆస్పత్రుల సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదు. కొన్ని చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమీపంలోనే మద్యం షాపులు ఉన్నాయి. దీనివల్ల రాత్రి వేళల్లో విధులు నిర్వహించడం కష్టమన్న భయాందోళన మహిళా సిబ్బందిలో నెలకొంది. ప్రతి ఆరోగ్య కేంద్రం 24 గంటలూ అందుబాటులో ఉండాలంటే తప్పనిసరిగా నైట్‌ వాచ్‌మెన్‌ ఉండాలి. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందే తప్పా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానం అమలు చేయాలంటే ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ తగినంత సిబ్బంది ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత లేకుండా 143 జిఒ విడుదల చేశారు. దీనిప్రకారం ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులతో సహా 14 మంది సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఈ పోస్టుల్లో మెడికల్‌ ఆఫీసర్లు -2, స్టాఫ్‌ నర్సులు-3, ఫార్మాసిస్ట్‌-1, ల్యాబ్‌ టెక్నీషియన్‌-1, సిహెచ్‌ఒ/పిహెచ్‌ఎన్‌-1, ఎంపిహెచ్‌ఎస్‌-2, ఎంపిహెచ్‌ ఈyఒ/హెచ్‌ఇ -1, ఎల్‌డీ కంప్యూటర్‌ ఆపరేటర్‌/యూడీసీ -1, ఎఫ్‌ఎన్‌వో/ఎంఎన్‌వో -1, నైట్‌ వాచ్‌మెన్‌/ అటెండర్‌ -1 చొప్పున ఉండాలి. అయితే ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్‌లను మాత్రమే నియమించారు. ప్రస్తుతం ప్రతి కేంద్రంలోను ఆరుగురు నుంచి ఏడుగురు వైద్య సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
వైద్యంలోనూ సర్దుబాటే..
ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ సర్దుబాటు ధోరణిని అలంబిస్తోంది. ఇటీవలే విద్యాశాఖలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. కొత్తగా భర్తీ చేయకుండా ఉన్నవారినే వేరే ప్రాంతంలో పోస్టింగ్‌ ఇచ్చారు. అదే విధానాన్ని వైద్య శాఖలోనూ అనుసరించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. స్టాఫ్‌ నర్సులతో పాటు, ఇతర సిబ్బందిని గుర్తించి అన్ని ఆరోగ్య కేంద్రాలకు సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. అలా అయినా సిబ్బంది కొరత వెంటాడుతోంది. క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.