ప్రజాశక్తి - బిక్కవోలు
ప్రజల ఆరోగ్యం కోసం, వాతావరణం పరిరక్షణ కోసం గ్రాసిం ఇండిస్టీస్ పెంపు సామర్థ్యాన్ని అడ్డుకుటామని అనపర్తి మాజీ ఎంఎల్‌ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం బలభద్రపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామవరంలో ఎఎంసి చైర్మన్ అభినందన సభలో ఎంఎల్‌ఎ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రాసిం కంపెనీకి అనుమతులు మంజూరు చేసింది టిడిపి ప్రభుత్వమే అంటూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆ ఫ్యాక్టరీకి 2013 మార్చి 22న అప్పటి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో అనుమతులు మంజూరు చేశారన్నారు. అనంతరం టిడిపి హయాంలో మేనేజ్‌మెంట్ మార్పులు జరిగాయి తప్ప అనుమతులు మంజూరు చేయలేదన్నారు. 2020 ఆగస్ట్ 18 నుంచి 2023 మార్చి 22 వరకు కంపెనీ అనుమతులు పెంచింది జగన్ ప్రభుత్వమేనన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఈ నెల 28న ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం బిక్కవోలు తహశీల్దార్ కార్యాలయంలోను బలభద్రపురం, దొంతమూరు, నల్లమిల్లి ,సింగంపల్లి గ్రామాల సచివాలయాల వద్ద బహిరంగంగా నోటీస్ బోర్డులో పెట్టమంటే ఈ రోజు వరకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ సామర్థ్యం పెంపువల్ల రోజుకి 17,145 లీటర్లు నీటిని, భూ గర్భ జలాలు నుంచి రోజుకు 5,570 లీటర్లు నీటిని వినియోగించుకుంటారన్నారు. దీని వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయన్నారు. గ్రామస్తులు గ్రాసిం కంపెనీని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం మాత్రం వత్తాసు పలుకుతుందన్నారు. ఈ సమావేశంలో ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటరామారెడ్డి, సుబ్బారెడ్డి, త్రిమూర్తులు, పాల్గొన్నారు.










