May 21,2023 22:41

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయిలో కీలకంగా పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల మెడపై కత్తి వేలాడుతోంది. సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత కోసం ఫీల్డ్‌ అసిస్టెంట్లు దశల వారీ పోరాటాలు చేసినా అధికార యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పని దినాలతో సంబంధం లేకుండా వేతనం ఇవ్వడం తోపాటు, జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా తరువాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చి, నెమ్మదిగా పనులు ప్రారంభమైనా ఇప్పటికీ కనీస భరోసా కల్పించలేదు. తాజాగా పని దినాల ఆధారంగానే జీతాలు ఇస్తుండటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గతంలో 910 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉండేవారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్ష్యాలను చేరుకోవటంతో వెనుకపడుతూ వచ్చారు. ఈ విధంగా దశల వారీగా 350మంది సీనియర్‌ మేట్లుగా మిగిలిపోయారు. ఇదే విధానం అమలు చేస్తే రాబోయే రోజుల్లో పూర్తిగా ఉపాధికి దూరమవుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టార్గెట్లను ఉపసంహరించుకుని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కనీస వేతనం నెలకు రూ.26000 అమలు చేయాలనే డిమాండ్‌ ముందుకొస్తోంది.
అందని ద్రాక్షలా టార్గెట్లు
ఏడాదిలో గ్రామంలో 7,500 పని దినాలు కల్పించిన వారిని ఎ గ్రేడ్‌ కింద చేర్చి వారికి నెలకు రూ.8,900 వేతనం, రూ.350 అలవెన్స్‌ ఇస్తున్నారు. 7,500-6,500 మధ్య పని దినాలు కల్పించిన వారిని బి గ్రేడ్‌గా పరిగణించి రూ.7,900 వేతనం, రూ.350 అలవెన్స్‌లు, 5,000 నుంచి 6,500 మధ్య పనిదినాలు కల్పించిన వారిని సి గ్రేడ్‌గా పరిగణించి రూ.6,400 వేతనం, రూ.350 అలవెన్స్‌లు ఇస్తున్నారు. 5,000 కంటే తక్కువ పని దినాలు కల్పించిన వారికి జీతాలు ఉండవు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ఫలితంగానూ, పట్టణాలు, నగర పంచాయతీల్లో కొన్ని గ్రామాలను విలీనం చేయడంతోనూ గతంలో ప్రభావం పడిందని పలువురు ఫీల్డ్‌ అసిస్టెంట్లు వాపోతున్నారు. ఎ గ్రేడ్‌, బి గ్రేడ్‌, సి గ్రేడ్‌ కోటాలో కొందరికి మాత్రమే జీతాలు చెల్లించి మిగిలిన వారికి మొండిచేయి చూపిస్తూ పొమ్మన కుండా పొగబెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లు కోరుతున్నారు.
మూడు నాలుగు నెలలే పనులు..
ఉపాధి హామీ పనులు ఏడాదంతా సాగడం లేదు. వేసవిలో మూడు నుంచి నాలుగు నెలలకు మించి పనులు జరగడం లేదు. ఫిబ్రవరి, మే వరకే కాస్త హడావిడి కనిపిస్తోంది. మిగతా రోజుల్లో వ్యవసాయ పనులు ఉన్నందున ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. గత రెండేళ్లుగా వర్షాలు సమద్ధిగా కురుస్తుండటంతో రెండేళ్లుగా వ్యవసాయ పనుల్లో జనం బిజీగా ఉండటంతోనూ ఉపాధి పనులు పెద్దగా సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు వేతనం రూ.272 ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో 200 మించి రావటంలేదు. దీనికి పలు సాంకేతిక కారణాలు అడ్డంకిగా ఉన్నాయి. పట్టణాలలో కూలీలకు కనీసంగా సగటున రోజు కూలీ రూ.600 వరకూ చెల్లించే అవకాశం ఉంది. దీంతో అత్యధిక మంది పట్టణాలలో అడ్డాకూలీలుగా తరలివెళుతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లు కోరుతున్నారు. కూలీలకు వేతనం పెంచి ఇస్తే ఉపాధి పనులకు ఆసక్తి చూపిస్తారని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కార్మికులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేస్తున్నారు.