ప్రజాశక్తి-గోపాలపురం సగ్గొండ గ్రామానికి అతి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ నిర్మాణం చేపట్టొద్దంటూ గ్రామస్తులు శనివారం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం నిర్మాణ స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో పంచాయతీ కార్యాలయంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోపాలపురం పోలీసులు ఎస్‌ఐ కె.రామకష్ణ, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులను సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రజాప్రతినిధులు మాట్లాడారు.
సగ్గొండ గ్రామపంచాయతీ గంగోలు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 989ఎ, 989ఎ2, 988బిలో 5.68 ఎకరాల్లో సిఎస్‌డి ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నిర్మాణం కోసం పంచాయతీ ప్రజాభిప్రాయం సేకరణ జరపకుండా తీర్మానం చేసినట్టు తెలిపారు. ఫ్యాక్టరీ ప్రదేశం గోపవరం గ్రామంలోని జనావాసాలకు అతి సమీపంలో ఉందన్నారు. ఈ ప్రదేశానికి ఆనుకుని జీడి మామిడి, తోటలు, విలువైన పంట భూములు ఉన్నాయని తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వేస్ట్ వాటర్ వల్ల దిగువ భాగంలో ఉన్న జీవనాధారమైన కరగట్టు చెరువు, దుబ్బల చెరువులు కలుషితమై ఆయకట్టులో ఉన్న పంట భూములు పాడయ్యే ప్రమాదం ఉందని వారు తెలిపారు. భూగర్భ జలాలు, వాయు కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, గ్రామ ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ నిరసన తెలిపారు. దీనిపై సర్పంచ్ ఎండపల్లి శేఖర్‌బాబు, పంచాయతీ కార్యదర్శి అనురాధ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫ్యాక్టరీ నిర్మాణానికి తహశీల్దారు పంచాయతీ తీర్మానం కోరారని చెప్పారు. దీనిపై కేవలం ల్యాండ్ కన్వర్షన్‌కు మాత్రమే తీర్మానం జరిపినట్లు తెలిపారు. ఆ భూమిలో ఫ్యాక్టరీ నిర్మించేటప్పుడు సగ్గొండ గ్రామ ప్రజల ఆరోగ్య భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాయు, నీటి కాలుష్యంపై సరైన భద్రత ప్రమాణాలు పాటించాలని ఫ్యాక్టరీ వారికి సూచించాలని కోరుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు. దీనిపై వచ్చే వారంలో మహాజనసభ (గ్రామసభ) ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఆందోళనలో పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులు ఎండపల్లి శ్రీనివాస్, మేణి సుధాకర్, పూలపల్లి బోస్, రేలంగి వెంకటేశ్వరరావు, ఎంపిటిసి మేణి రామచంద్రం పాల్గొన్నారు.










