ప్రజాశక్తి-కడియం
శ్రావణమాసం రావడంతో వివాహాది శుభకార్యాలు, పూజలు, వ్రతాలు అధికమవ్వడంతో ఈ పూల అమ్మకాలు జోరు అందుకున్నాయి. ముఖ్యంగా శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా గురువారం మండలంలోని కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఇక్కడ పూల దిగుబడులు అంతగా లేనందున తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి టన్నుల కొలది బంతి, చామంతి, గులాబీ వంటి పూలను దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండే గాక , ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలుదారులు తరలివచ్చి కావలసిన పూలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి పూల దిగుమతులు చేసుకోవడం వల్ల ధరలు కూడా అధికంగా ఉన్నాయి. ఇటీవల వచ్చిన వరదలకు కడియం మండలంతో పాటు డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లోని లంక ప్రాంతాల పూలపంట పాడవ్వడంతో దిగుమతులకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం లిల్లీ, మల్లి, జాజులు, కనకాంబరాలు, దేశవాళీ గులాబీలు మాత్రమే ఈ ప్రాంతాల్లో దిగుబడులు ఉన్నాయి. మిగిలిన పువ్వులు ఇతర రాష్ట్రాలు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కడియపులంక మార్కెట్ కేంద్రంగానే కొనుగోలు , అమ్మకాలు జరుగుతుంటాయి.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా గురువారం పూల మార్కెట్లో పూల ధరలు కేజి ఒక్కంటికి ఈ విధంగా ఉన్నాయి.
చామంతి: రూ.350 నుంచి రూ.450, పసుపు బంతి: రూ.60 నుంచి రూ.70, ఆరంజ్ బంతి: రూ.70 నుంచి రూ.80, లిల్లీ: రూ.200 నుంచి రూ.250, మల్లి: రూ.800 నుంచి రూ.900, జాజులు: రూ.550 నుంచి రూ.650, కాగడాలు: రూ.600 నుంచి రూ.650, కనకాంబరాల బారు: రూ.300 నుంచి రూ.350










