May 29,2023 22:17

ఇళ్ల పట్టాలు అందిస్తున్న మంత్రులు, వేణు, వనిత, కలెక్టర్‌

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
అర్హతే ప్రామాణికంగా నవరత్నాలను అమలు చేస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సిహెచ్‌ఎస్‌.వేణుగోపాలకృష్ణ, హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. సోమవారం కలెక్టర్‌ సమక్షంలో మంత్రుల చేతుల మీదుగా పేదలందరికీ ఇళ్ల పథకం కింద తిగిరిపల్లి దివ్య తల్లి తిగిరిపల్లి సంధ్యకు ఇళ్ల పట్టాను అందించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు 90 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు వారికి పట్టాలు అందించామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కొవ్వూరు పర్యటనలో తన ప్రసంగంతో ఆకట్టుకున్న కుమారి దివ్య ఇళ్లు లేని విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లింది. సిఎం హామీ మేరకు దివ్య తల్లి సంధ్యకి పెద్దేవంలో సెంటున్నర ఇంటి స్థలం ఇచ్చినట్లు తెలిపారు. హోం మంత్రి వనిత మట్లాడుతూ రాష్ట్రంలో అర్హులలందరికీ సంక్షేమ పథకాలు చేరాలన్నదే సిఎం జగన్‌ ఆశయమన్నారు. కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ పెద్దేవంలో జగనన్న కాలనీలో సర్వే నంబర్‌ 392/8బి1లో సంధ్యకు ప్లాటు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.