ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిఎం వైఎస్.జగన్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమల్లో జిల్లా యంత్రాంగం సఫలీకతమైందని ఇన్‌ఛార్జి మంత్రి, బిసి సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్.వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం, జిల్లా స్థాయి అసైన్మెంట్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. తొమ్మిది అంశాల అజెండాగా ఉపాధిహామీ, విద్య నాడు - నేడు, హౌసింగ్, పౌర సరఫరాలు ధాన్యం సేకరణ, వ్యవసాయం, హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, వైద్యారోగ్యం అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లాలో చేపట్టి అమలు చేస్తున్న పలు అభివద్ధి అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల్లో జిల్లా యంత్రాంగం రెండు లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఈ ఏడాది రబీలో మెరుగైన దిగుబడి వచ్చిందని, అకాల వర్షాల కారణంగా కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడినా, ప్రభుత్వం తీసుకున్న చర్యల, జిల్లా యంత్రాంగం ద్వారా ఇప్పటి వరకూ జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. జిల్లాలో 100 రోజుల కనీస పని దినాలు కల్పించడం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి మరింతగా పనిదినాలు కల్పించాలని మంత్రి వేణు సూచించారు.
ప్రాధాన్యత భవనాల కింద 390 గ్రామ సచివాలయాలను రూ.150.20 కోట్లతో 327 పూర్తి చేశామని, 61 ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. ఆర్‌బికెలు, వైయస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ, బల్క్ మిల్క్ యూనిట్స్ భవనాల వివరాలు తెలిపారు. మిగిలిన భవనాల నిర్మాణం పనులు పూర్తి చెయ్యాలని మంత్రి ఆదేశించారు. ఐఐటిలో చేరే వారిలో కొందరు డ్రాపౌట్ అవుతున్నారని, వారిలో నైపుణ్య బోధన పద్ధతులను ఆచరించాలని పేర్కొన్నారు.
నాడు నేడు పనులకు సంబంధించిన పెండింగ్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి వేణుగోపాల్ ఆదేశించారు. జూన్ 11 లోగా పనులు పూర్తి చేసి, 3వ దశకు చెందిన 406 పనులకు సంబంధించి వ్యక్తిగత శ్రద్ద తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందచేసిన కంప్యూటర్ వినియోగంపై దష్టి పెట్టాలని, ప్రతి విద్యార్థి ఆమేరకు ఎంత మంది వాడుతున్నారో డేటా ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానంను ప్రజల్లోకి విస్తతంగా తీసుకుని వెళ్ళాలని తెలిపారు.
జిల్లాలో 68,074 ఇంటి నిర్మాణాలు లక్ష్యం కాగా, 58,916 నిర్మాణాలు ప్రారంభించి, 17571 పూర్తి చేశామని మంత్రి వేణుగోపాల్ కష్ణ తెలిపారు. గహ నిర్మాణానికి గుర్తించిన కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టిన పనుల వేగవంతం చేయాలని ఎంపీ మార్గని భరత్ రామ్ కోరారు.
జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, 51 వేల హెక్టార్లలో కోతలు పూర్తి చేశారని తెలిపారు. జిల్లాలో 93 శాతం కోతలు పూర్తి అయ్యాయని, ఇప్పటి వరకు ప్రభుత్వం 1.98 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ, బహిరంగ మార్కెట్‌లో 1.22 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తోందని, ఆమేరకు యంత్ర సేవా పథకం అమలులో మరింత నిబద్దత చూపాల్సి ఉంటుందని, ఆ మేరకు రైతుకు అవగాహన అవసరమని మంత్రి వేణుగోపాల కష్ణ తెలిపారు. ఇరిగేషన్ శాఖ తరపున కాటన్ బ్యారేజి ఆధునికీకరణ పనుల కోసం రూ.62 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు తెలిపారు.
రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ 2023-24 కి సంబంధించి ఉపాధిహామీ పథకం అమలులో ఉపాధిహామీ కింద చేపట్టనున్న పనులకు సంబంధించి సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాజానగరం మండలంలో అమత్ సరోవర్ కింద చెరువుల అభివద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. సభ్యులు సూచించిన ప్రతిపాదనలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. స్కూల్స్ ప్రారంభించే నాటికి పుస్తకాలు, ఇతర అనుబంధ మెటీరియల్ విద్యార్థులకు చేరేలా చూడాలని ఎంఎల్‌సి ఇళ్ళ వెంకటేశ్వర రావు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, జ్యోతుల చంటిబాబు, ఎంఎల్‌సిలు బి.ఇజ్రాయెల్ వంకా రవీంద్రనాద్, అనంత ఉదయభాస్కర్, డిసిఎంఎస్ చైర్‌పర్సన్ ఎస్.మణికుమారి, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్, డిఆర్‌ఒ జి.నరసింహులు, ఆర్‌డిఒలు ఎ.చైత్రవర్షిణి, ఎస్.మల్లిబాబు, డ్వామా పీడీ జిఎస్.రామగోపాల్, పంచాయితీ రాజ్ ఎస్‌ఇ ఎబివి.ప్రసాద్, డిఇఒ ఎస్.అబ్రహాం, జిల్లా హౌసింగ్ అధికారి జి.పరశురామ్, ఇన్‌ఛార్జి డిఎస్‌ఇ పి.ప్రసాదరావు, జిల్లా వ్యవసాయ శాఖధికారి ఎస్.మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి వి. రాధాకృష్ణ పాల్గొన్నారు.










