నేడు జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమం
ప్రజాశక్తి-నల్లజర్ల
కడుపులో పెరిగిన చిన్నపాటి నులిపురుగులు అనేక అనర్థాలకు దారితీస్తాయి. వీటి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రీయ బాలాస్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా చిన్నారులైన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టింది. జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమంను ఈ నెల 14న నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్న 19 ఏళ్లలోపు అందరికీ మధ్యాహ్నం భోజనం ముగిసిన అనంతరం అల్బెండజోల్ మాత్రలను వేయనున్నారు.ఉపాధ్యాయుల సహకారంతో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
నులి పురుగులు, వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు
సన్నటి దారం లాంటి పురుగులు పేగుల గోడలకు అంటి వుండి శరీరంలోని రక్తాన్ని పీలుస్తూ ఆహారం శరీరానికి వంటబట్టకుండా చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ఇతర అవయవాలకూ హాని కలిగిస్తాయి. పిల్లల్లో సాధారణంగా మూడు రకాల పురుగులు కనపడతాయి. అవి ఏలిక పాములు, నులిపురుగులు, కొంకిపురుగులు. 50 నుంచి 60 శాతం మంది ఏదోక రకం నులిపురుగులు బారిన పడి రక్త హీనత, అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు.
అసలు ఎందుకు వస్తాయి?
కలుషిత ఆహారం, ఈగలు వాలిన తినుబండారాలు, దుమ్ము, ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల వ్యాపించే అవకాశం ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన ద్వారా, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్లుకు వెళ్లడం ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు వంటి సరుకులను పరిశుభ్రమైన నీటితో కడగకపోవడం వల్ల కూడా సంక్రమిస్తాయి. భోజనం వండే వారు, వడ్డించే వారు తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడగకపోవడం వల్ల కూఆ నులిపురుగులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఆడుకోవడం వల్ల కూడా నులిపురుగుల లార్వాలు పిల్లలు జీర్ణకోశంలోకి నేరుగా ప్రవేశిస్తాయి.
ఎలాంటి సమస్యలుంటాయి
రక్తహీనత, నీరసించడం, దగ్గు, ఆయాసం, ఎదుగుదల లేకపోవడం, మల, మూత్ర విసర్జన ప్రదేశంలో దురద, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, బరువుతగ్గడం, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, మలంలో రక్తం పడడం, జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించటం వంటివి ఉంటే నులిపురుగులు ఉన్నట్టు గుర్తించాలి.
జాగ్రత్తలు...నివారణ...
భోజనానికి ముందు, ఆటలాడిన తర్వాత అలాగే మల విసర్జన తర్వాత ప్రతిసారీ చేతులు సుమారు రెండు నిమిషాలు పాటు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. నులిపురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలను తీసుకోవాలి. 19 ఏళ్లలోపు వారు వైద్యసిబ్బంది సూచించిన మేరకు వీటిని తీసుకోవాలి. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లలకు సగం మాత్రను పొడిచేసి నీటిలో వేసి కలిపి తాగించాలి. మూడేళ్ల నుంచి 19 ఏళ్లలోపు వారికి ఒక పూర్తి ఆల్బెండజోల్ మాత్రను చప్పరిస్తూ నమిలి మింగించాలి.
ఆల్బెండజోల్ మాత్రను అందరూ వేసుకోవచ్చా...
ఆల్బెండాజోల్ మాత్రను అందరూ వేసుకోరాదు. ఆనారోగ్యంతో బాధపడుతున్న వారు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రను వేసుకోవాలి. ఏడాదిలోపు వయస్సు వారికి, గర్భిణులు, బాలింతలు, కాలేయ వ్యాధిగ్రస్తులకు, ఉదర సంబంధ క్యాన్సర్ వున్న వారికి, పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధి ఉన్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వరాదు.
చిన్న సమస్య కాదు
నులిపురుగు కంటికి కనిపించని శత్రువు. ఇది మనిషి పేగుల్లోకి చేరి రక్తాన్ని పీల్చి రక్తహీనతకు గురి చేస్తుంది. ఇది చిన్న సమస్యేమీ కాదు. నులిపురుగుల వల్ల భావి భారతపౌరులైన చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వీటి వల్ల పిల్లలు అనారోగ్యాల పాలవుతున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నాం.
- డాక్టర్ తెల్లం గంగాధరరావు, నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రి
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా...
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని చేపట్టాం. ు అంగన్‌వాడీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు 19 ఏళ్ల లోపు అందరికీ నులిపురుగుల నివారణా మాత్రలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఆశా, ఆరోగ్య కార్యకర్త, ఉపాధ్యాయులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం.
- కె.వెంకటచంద్రశేఖరరాజు, సిహెచ్‌ఒ










