May 12,2023 00:00

నాలుగేళ్లలో బంగారం ధర రెట్టింపు
2019లో గ్రాము రూ.3,200. నేడు రూ.6,200
కార్పొరేట్‌ సంస్థల రాకతో స్థానిక షాపులు వెలవెల
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
బంగారం ధరలు రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. గడిచిన పదేళ్లలో గ్రాముకు రూ.3280 వరకూ పెరిగింది. వెండి ధరలు సైతం పరుగులు పెడుతున్నాయి. బంగారం ధర నాలుగేళ్లలో రెట్టింపైంది. కోవిడ్‌ కారణంగా అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. కఆని బంగారం మాత్రం దూసుకుపోయింది. తాజాగా పది గ్రాముల బిస్కట్‌ బంగారం రూ.62 వేలకు చేరింది. ధర ఇదే విధంగా పెరిగితే త్వరలో రూ.70 వేలకు చేరే అవకాశం ఉందని బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరల పెరుగుదల, మరో వైపు కార్పొరేట్‌ సంస్థలు రాకతో స్థానిక వ్యాపారాలు పూర్తిగా వెల వెల బోతున్నాయి. ఆభరణాల తయారీ కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి వెతుక్కుంటూ వలసలు వెళ్లిపోతున్నారు.
బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుండటంతో మార్కెట్‌ వెలవెలబోతోంది. గడిచిన వారంలో పసిడి ధర గ్రాముకు రూ.200పైనే పెరిగింది. గత నెలలో చాలాకాలం గ్రాము బంగారం రూ.5400 నుంచి రూ.5900 మధ్యనే ఉంది. అంతర్జా తీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావం బులియన్‌ మార్కెట్‌పై చూపింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడంతో ధర ఆకాశాన్ని అంటింది. జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పట్టణాల్లో అత్యధికంగా బంగారం దుకాణాలు ఉన్నాయి. అత్యధిక వ్యాపారం రాజమండ్రిలో జరుగుతోంది. మెయిన్‌ రోడ్డు, గోకవరం బస్టాండ్‌, ఎవి అప్పారావు రోడ్డు తదితర ప్రాంతాల్లో కార్పొరేట్‌ సంస్థలలు, ఇతర చిన్న షాపులు కలిపి 200పైగా ఉన్నాయి. ప్రస్తుతం ధర పెరగటంతో వినియోగ దారులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత తగ్గు తుందన్న ఆశతో అవసరం ఉన్నా ఆ స్థాయిలో కొనుగోలు చేయడం లేదు. దీంతో జ్యూయలరీ షాపుల్లో సందడి కనిపించడం లేదు. దీనికి తగ్గట్టు వెండి కూడా దూసుకుపోతోంది. గత నెలలో కేజీ రూ.68 వేల మధ్య చాలాకాలం నిలకడగా ఉన్న ధర పసిడితో పోటీ పడుతోంది. అయితే కేజీ వెండి రూ.73 వేలకు చేరింది.
కొరవడిన సందడి
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నేపధ్యంలో కళ కళలాడాల్సిన బంగారం షాపులు వెలవెల బోతున్నాయి. ఓ వైపు ధరలు పెరగటం మరో వైపు, కార్పొరేట్‌ సంస్థలు రాక ప్రధాన కారణమని జ్యూjలరీ షాపుల యజమానులు చెబుతున్నారు. 2013లో రూ.2,920 ధర ఉండేది. 2021లో రూ.4,800, 2022 రూ.5,300, 2023లో రూ.6,200 చేరింది. గడిచిన పదేళ్లలో అక్షరాలా రూ.3280 ధర పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో సుమారు 10 వేలకు పైగా కార్మికులు ఆభరణాల తయారీ రంగంలో ఉపాధి పొందేవారు. ఈ రంగంలో ఆధునిక సాంకేతిక పరికరాలు రావటం, ధరలు పెరుగుదల, కార్పొరేట్‌ సంస్థలు రెడీమెడ్‌ వ్యాపారం ప్రారంభించటంతో కార్మికులకు ఉపాధి కొరవడింది. దీంతో సుమారు 40 శాతం మంది ఇతర రంగాలకు తరలి వెళ్లినట్లు జ్యూయలరీ వర్కర్స్‌ చెబుతున్నారు. బంగారు ఆభరణాల కోసం ఇతర జిల్లాల నుంచి సైతం గతంలో రాజమహేంద్రవరం వచ్చే వారని ప్రస్తుతం స్థానికులు సైతం రెడీమెడ్‌పై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
వ్యాపారం ఆశాజనకంగా లేదు
బంగారు ఆభరణాలు తయరీ, విక్రయం రంగంలో మూడు దశాబ్ధాలుగా పని చేస్తున్నాను. గతంలో పెళ్లిళ్ల సీజన్‌లో విరివిగా ఆర్డర్లు వచ్చేవి. మా కుటుంబంతో పాటు మరో ఐదుగురు మా షాపులోఉపాధి పొందేవారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. కార్పొరేట్‌ సంస్థలు గడిచిన ఐదేళ్లలో 5కు పైగా భారీ షాపులు ఏర్పాటు చేశాయి. దీంతో స్థానిక వ్యాపారాలు పడిపో యాయి. పండుగలకు, పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. గతంలో తయారీ చేయించే వారు సైతం ప్రస్తుతం రెడీమెడ్‌ కొనుగోలు చేయటంతో ఉపాధి కొరవడింది.
- కె.భాస్కరాచారి, మెయిన్‌ రోడ్డు