Feb 18,2023 15:29
  • చోద్యం చూస్తున్న పంచాయతీ కార్యవర్గం
  • ఎదురైన కుల వివక్షత పై ఆవేదన వ్యక్తం చేస్తున్న దళితులు బాధితులు

ప్రజాశక్తి - సీతానగరం :  వంగలపూడి ఇసుక ర్యాంపులో పట్టిసీమ ఉత్సవ కమిటీ మరియు పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సీతానగరం మండలం వంగలపూడి గ్రామం మీదుగా తరలి వెళ్లే పట్టిసీమ తిరణాళ్ళ భక్తుల వాహనాల స్టాండును ఏర్పాటు చేయడం కొరకు ఏళ్ల తరబడి ఉన్న దళితుల సమాధులను సైతం బ్లేడు ట్రాక్టర్ తో గ్రామ నాయకులు,పంచాయతీ అధికారులు దళితుల సమాధులను తొలగించారని స్థానిక దళిత పెద్దలు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా వంగలపూడి దళిత పెద్దలు తెలియజేస్తూ దళితులపైన ఇలాంటి కుల వివక్షత ఏంటని అడిగితే అగ్రవర్ణానికి చెందిన వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై దళిత పెద్దలుగా కన్నీటి పర్యాంతమయ్యామని తెలిపారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం తమ బంధువుల సమాధుల వద్దకు వెళ్ళి జ్ఞాపకార్థంగా సంవత్సరికాలు చేసుకోవడానికి వీలు లేకుండా 20 సమాధులను తొలగించారని బాధితులు తెలియజేశారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి కుల వివక్షతతో బ్రతకాలో అర్థం కావడం లేదని తెలియజేశారు. కావాలనే పంచాయితీ అధికారులు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారని ప్రజాసంఘాలు,ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. జరిగిన అన్యాయం పై జిల్లా అధికారులు, పోలీసులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. దళితుల సమాధులను తొలగించిన ట్రాక్టర్ను సీజ్ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు. తొలగించిన సమాధులను తిరిగి పునః నిర్మాణం చేయాలని కోరారు. ఇలాంటి సందర్భాలు మరలా జరగకుండా సమాధుల రక్షణ కొరకు పూర్తిస్థాయిలో రక్షణ గోడ ఏర్పాటు చేయాలని వంగలపూడి గ్రామ దళిత పెద్దలు కోరారు. లేనిపక్షంలో అన్ని దళిత సంఘాలను ఐక్యం చేసుకుని నిరసన దీక్ష చేపడతామని అన్నారు. జరిగిన అన్యాయంపై ఎస్సీ ఎస్టీ కమీషన్ దృష్టికి తీసుకువెళ్తామని వంగలపూడి దళిత పెద్దలు విలేకరులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండిగమెల్లి శ్రీను, ఇండిగమెల్లి వెంకట శ్రీనివాసరావు, ముప్పిడి ప్రభాకర్ రావు, ఇండిగమెల్లి వెంకటేశ్వర్లు, తవిటికి చిటియ్య, తవిటికి కృష్ణ, చిడిపి సత్యనారాయణ, చిడిపి బాలకృష్ణ, ఇండిగమెల్లి రమేష్, ఇండిగమెల్లి నల్లయ్య, కోడెల్లి శ్రీను, కోడెల్లి కన్నయ్య, చిర్రా వీర్రాజు, ఇండిగమెల్లి బాలాజీ, కుమ్మర చంటి, కోడెల్లి రాముడు, ఇండిగమెల్లి చిన్ని, కోడెల్లి శివ తదితరులు పాల్గొన్నారు.