ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు అరకొర జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక నానా అవస్థలూ పడుతున్నారు. రోజుకు 12 గంటలకు పైగానే ఉపాధ్యాయులు పని చేస్తున్నా పూట గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు తొలగిస్తారో కూడా తెలియదు. ప్రతి ఏటా అడ్మిషన్ల లక్ష్యం చేరుకోకపోతే యాజమాన్యాలు ఉద్యోగం నుంచి తొలగించడం పరిపాటిగా మారింది. దశాబ్ధాల కాలంగా పని చేస్తున్నప్పటికీ అత్యధిక మంది జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. గడిచిన నాలుగేళ్లలో ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. దీనికి తోడుగా ఒక్క డిఎస్‌సి కూడా ప్రకటించకపోవటం ప్రైవేట్ టీచర్ల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముతున్నాయి.
నాలుగేళ్లుగా డిఎస్‌సి ప్రకటించని సర్కారు
జిల్లాలో 205 ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 2,400 మంది ఉపాధ్యాయున్నారని పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధిక మంది పీజీలు చేసినవారున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్న విద్యా రంగంలో రెగ్యులర్ ఉద్యోగాల కోసం దీర్ఘకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. కొందరు వయోభారం మీద పడటంతో కుటుంబాలను పోషించుకోవడానికి ఈ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్‌పి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వ పాఠ శాలలు ఒక్కొక్కటే మూత పడు తున్నాయి. కరోనా సమయంలో ప్రైవేటు ఉపాధ్యా యులకు ఉద్యోగాలు పోయి కుటుంబాలు రోడ్డున పడ్డారు. కుటుం బాలను పోషించు కోవడానికి కొందరు రోడ్లపై టీకొట్లు పెట్టు కోవాల్సి వచ్చింది. మరి కొంతమంది ఉపాధ్యాయులు కరోనాకు గురై చికిత్స చేయించుకోవడానికి నగదు లేక మరణించిన ఉదాహరణలున్నాయి.
ఎన్నికల హామీలు బుట్టదాఖలు
ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఎలాంటి పథకాలు లేవు. వారికి ఆరోగ్య శ్రీకార్డులు లేవు. నవరత్నాల పథకాల్లో ప్రభుత్వం కోత విధించింది. ప్రైవేటు టీచర్లకు పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉండటం లేదు. ఎన్నికల మందు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అన్నీ మర్చిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 'కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు గుర్తించాం.. వైషఙఫఙ ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి చట్టం చేసి వారికి కనీసం వేతనం రెగ్యులర్‌గా వచ్చేలా చూస్తాం.. పని గంటలు, సెలవులు, పిఎఫ్, ఇఎస్‌ఐ, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి నిబంధనలు వర్తింప చేస్తాం.' అని ఎన్నికల ముందు పాదయాత్రలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక ఆ సంగతి మర్చిపోయారు. దీంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










