Oct 17,2023 22:44

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నగరం ప్రత్యేక ఆకర్షణకు కేంద్రంగా నిలుస్తుందని మున్సిపల్‌ శాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు . నగరంలో రూ.177 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన త్వరలో చేపట్టబోయే పలు పనులకు మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎంతో సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నడిపిస్తున్నారని తెలిపారు. అదే క్రమంలో రాజమహేంద్రవరం నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా సుమారు రూ. 330 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు రెండు పూట్ల స్వచ్ఛమైన తాగునీరు అందించే క్రమంలో కొట్లాది రూపాయలను హెచ్చించడం జరిగిందని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ ప్రజా సమస్యలను తెలుసుకోవడంతోపాటు భద్రతతో కూడిన మరింత మెరుగైన పరిపాలన అందించే దిశగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ దిశగా అడుగులు వేస్తుందన్నారు. రాజమహేంద్రవరం నగరాభివృద్ధి కొరకు ఇంత పెద్దఎత్తున నిధులు మంజూరు చేయటం సిఎంకి రాజమహేంద్రవరం నగరం పట్ల ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని వెల్లడిస్తుందని తెలిపారు. నగరానికి రూ.125 కోట్లను ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగిందన్నారు. విశాలమైన రోడ్లు, మెరుగైన డ్రైనేజీ, సెంట్రల్‌ బ్యూటిఫికేషన్‌, పచ్చదనంతో కూడిన విశాలమైన పార్కులు వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్మార్ట్‌ సిటీ దిశగా నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొ న్నారు. నగర అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్‌ మాధవీలత, మున్సిపల్‌ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌, పనితీరు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌.మాధవీలత, ఎంపి భరత్‌ రామ్‌, కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వాటి నిర్వహణ విషయంలో నగర ప్రజలు సహకారాలు అందించాలని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌, అత్యా ధునిక సమావేశ మందిరం ద్వారా చేపడుతున్న విధి విధానాలను మంత్రికి వివరించడం జరిగిందని కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ సత్తి సూర్యనారాయణ రెడ్డి, సహాయ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌, ఇంజనీరింగ్‌ చీఫ్‌ పి.ఆనందరావు, ఆర్‌ఎంసి అధికారులు పిఎం సత్యవేణి, జి. పాండురంగారావు, కె.సాంబశివరావు, రుడా మాజీ చైర్‌పర్సన్‌ ఎం.షర్మిల రెడ్డి, నగర కోఆర్డినేటర్‌ గూడూరు శ్రీనివాస్‌, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.