Mar 04,2023 23:26

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
జనసేన పార్టీ ప్రతీ కుటుంబానికి అండగా ఉంటుందని, దీనిలో భాగంగానే ఇటీవల మరణించిన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల మరణించిన పార్టీ క్రియాశీలక సభ్యుల ఒక్కొక్క కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఆయన పంపిణీ చేశారు. అలాగే వివిధ ప్రమాదంలో గాయపడిన పది మందికి రూ.50వేల చొప్పున సాయం అందించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ అధ్యక్షతన స్థానిక ఆనం రోటరీ హాల్లో ఈ కారక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నాదెండ్ల విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జనసేన ప్రతీ కుటుంబంలో ధైర్యం నింపేందుకు చేస్తుందన్నారు. ఇప్పటం ప్రజలపై వైసిపి కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవానికి స్థలం ఇచ్చినందుకు కక్షపూరితంగానే 120 అడుగుల విస్తీర్ణం పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. మచిలీపట్నంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటంలో అరెస్టు చేసిన 20మందిని తక్షణమే విడుదల చేయాలి లేని వక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ముల్లా శశిధర్‌, పంతం నానాజీ, వై.బాలకృష్ణ, అనుశ్రీ సత్యనారాయణ, వై. శ్రీనివాస్‌, సరోజ, స్వరూప, ప్రియ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.