Aug 20,2023 00:01

ప్రజాశక్తి-రాజానగరం
సమ్మర్‌ స్పెషల్‌ రివిజన్‌ 2024 లో భాగంగా ప్రతి ఒక్క ఇంటిని బూత్‌ స్థాయి అధికారులు సందర్శించి ఓటర్‌ ను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ డా. కె.మాధవీలత అన్నారు. మండలంలో పల్ల కడియం గ్రామంలో బిఎల్‌ఒ ఓటరు గుర్తింపు ఇంటింటి సర్వే ప్రక్రియను ఆర్‌డిఒ చైత్ర వర్షిణితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలో బిఎల్‌ ఒలు కీలక పాత్ర పోషించాలన్నారు. ఇంటింటికీ తిరిగి ఓటరును గుర్తించి, వాస్తవంగా ఆ గృహంలో లేకపోతే ఫారం -8 ద్వారా మార్పులు, చేర్పులు చేయాలన్నారు. 2024 లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటరును ఇంటింటికీ తిరిగి గుర్తించాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టమయిన ఆదేశాల నేపథ్యంలో నెల రోజుల పాటు ఈ ప్రక్రియ చేపట్టి నట్లు తెలిపారు. కొత్త ఓటర్ల నుంచి ఫారం -6 ద్వారా డిజిటలైజేషన్‌ ద్వారా నమోదు చేయడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆగస్ట్‌ 21 వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్న దృష్ట్యా మిగిలిన ఓటర్ల గుర్తింపు వేగవంతం చేసి, నూరుశాతం పూర్తి చేయాలన్నారు. అనంతరం సచివాలయంలో ఓటరు జాబితా సవరణ మేరకు ఇంటింటి ఓటరు గుర్తింపు లో భాగంగా ఓటరు చేర్పిక, తొలగింపు డిజిటలైజేషన్‌ ను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహశీల్దార్‌ పవన్‌ కుమార్‌, బిఎల్‌ఒలు తదితరులు పాల్గొన్నారు.