Feb 02,2023 23:22

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ రాష్ట్రంలో మూడేళ్ల పాలనలో గ్రామ వాలంటీర్లు ద్వారా అభివద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందించినట్టు హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు. బుధవారం కొవ్వూరు పట్టణం 23వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు మూడేళ్లుగా అమలు చేసిన పథకాల గురించి అడిగి, ప్రభుత్వం పేద నిరుపేదల సంక్షేమ పథకాలు వివరాలు ప్రజలకు వివరించారు. పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా, రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల స్థలపట్టాలు ఇచ్చి, వారి ఇష్టం మేరకు ఇళ్లు కట్టించి ఇస్తున్నట్టు చెప్పారు. అర్హత ఉండి ఇళ్ల స్థలాల కోసం దర ఖాస్తులు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గ్రామ, వార్డు, వాలంటీర్లు, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలని, అర్హులకు అన్ని సంక్షేమ పథకాలను అందజేయాలని పేర్కొన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, కరోనా విపత్తు వచ్చి ఆదాయ వనరులు లేకపోయినా రుణ మాఫీ, సున్నా వడ్డీ పథకాలు, వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అమ్మఒడి, రుణ మాఫీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో పేద ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి కోడూరి శివరామకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భావన రత్న కుమారి, జెడ్‌పి వైస్‌ చైర్‌పర్సన్‌ పోసిన శ్రీలేఖ పాల్గొన్నారు.