May 04,2023 23:19

'ప్రశ్నిస్తే జైలుకే.. అదే జగన్‌ విధానం..'

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం అవినీతిపై ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని, జగన్‌ విధానం అదేనని తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు వర్రే శ్రీనివాసరావు, వాసిరెడ్డి రాంబాబు, రెడ్డి మణేశ్వరావు తదితరులు ఆరోపించారు. స్థానిక మెయిన్‌ రోడ్డులోని హోటల్‌ జగదీశ్వరిలో మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతి సుందరి, మాటూరి రంగారావు, ఇన్నమూరి రాంబాబు, చెన్నా వీరభద్రరావు, కోరుమిల్లి విజయశేఖర్‌, కిలపర్తి శ్రీనివాస్‌, రాచపల్లి ప్రసాద్‌, కడలి రామకష్ణ, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, కరగాని మాధవిలత, కొమ్మ శ్రీనివాస్‌, గొర్రెల రమణి, కూరాకుల తులసి, బొమ్మనమైన శ్రీనివాస్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, జవ్వాది మురళి, బట్లంకి కష్ణవేణి, నాయకులు సప్పా వెంకట రమణ, కరగాని వేణు మాట్లాడారు. నియమ నింబంధనలకు లోబడి చట్టబద్ధంగా చిట్‌ వ్యాపారం చేస్తున్న ఆదిరెడ్డి కుటుంబంపై ఎందుకు కక్ష కట్టారని ప్రశ్నించారు. మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులను అన్యాయంగా అరెస్టు చేసి సెంట్రల్‌ జైలుకు తరలించడాన్ని వారు తప్పు బట్టారు. వారిని కావాలనే అన్యాయంగా అక్రమ కేసుల్లో ఇరికించారన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా కాక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వేదికను కూల్చేశారని, అప్పటి నుంచే టిడిపి నాయకులు, బిసి, ఎస్‌లిపై జగన్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అధికారాన్ని సర్వీస్‌ మోటివ్‌గా కాక కక్ష సాధింపులకు వినియోగిస్తున్నారన్నారు. జగన్‌ వంటి పాలకుని 2019 ముందు ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజా సేవ చేయడం మానేసి బెదిరింపులు, దౌర్జన్యాలు ఏమిటని ప్రశ్నించారు. ఆదిరెడ్డి కుటుంబం 30 ఏళ్లుగా చిట్‌ వ్యాపారంలో ఉందని, ఏనాడూ ఎవరికి అన్యాయం చేసిన దాఖలాలు లేవన్నారు. కష్టపడి పైకొచ్చిన కుటుంబం ఆదిరెడ్డిదన్నారు. యాంటిసిపేటరీ బెయిల్‌ తెచ్చున్నా కావాలని అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో గతంలో చాలా ప్రాంతాలు నీట మునిగేవని వాటన్నింటినీ అభివద్ధి చేశామని గుర్తు చేశారు. 23 రోడ్లు విస్తరించామన్నారు. అసలు అభివద్ధి చేసి రాజమండ్రి స్వరూపాన్ని మార్చింది తెలుగుదేశం పార్టీయేనన్నారు.
నేడు టిడిపి అధినేత చంద్రబాబు రాక
జగన్‌ ప్రభుత్వ కుట్రలో భాగంగా అన్యాయంగా అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులను పరామర్శించేందుకు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాజమహేంద్రవరం వస్తున్నారని టిడిపి నాయకుతు తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి భవానీని కూడా ఆయన పరామర్శిస్తారని తెలిపారు.