ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. సోమవారం తెలుగు, సంస్కతం పరీక్షలను నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 126 పరీక్షా కేంద్రాల్లో 23,229 విద్యార్థులకు 22,951 మంది విద్యార్థులు హాజరయ్యారు. 278 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు పరీక్షలను ప్రారంభించారు. దీంతో 8 గంటల నుంచే జిల్లాలోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. హాల్ టికెట్లను పరిశీలించిన అనంతరం పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. వేసవి దష్ట్యా తాగునీరు అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీసుకూ అవకాశం లేకుండా పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్, ఎలక్ట్రానికి గాడ్జెట్స్‌ను అనుమతించలేదు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది కూడా మెడికల్ క్యాంపుల్లో ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయి తొలి రోజు ఎటువంటి పిర్యాదులు నమోదు కాలేదు.
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టరు కె.మాధవిలత రాజమ హేంద్రవరం రూరల్ ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల విధానాన్ని తొలిరోజు ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా పరిశీలకులు 7 పరీక్షా కేంద్రాలను, డిఇఒ 6 పరీక్షా కేంద్రాలను, ఇతర తనిఖీ అధికార్లు 26 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ ప్రశాంతంగా జరిగాయని డిఇఒ ఎస్.అబ్రహాం తెలిపారు.










