ప్రజాశక్తి - చాగల్లు
విచారణ పేరుతో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత యువకుడు చాగల్లు మండలం కుంకుడుమిల్లికి చెందిన వడ్డే వెంకటప్రసాద్‌ను ఆదివారం పలువురు దళిత నాయకులు పరామర్శించారు. ఒక మహిళ మిస్సింగ్ కేసులో విచారణ నిమిత్తం కడియం పోలీసులు వెంకటప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, మంచినీళ్లు అడిగితే మూత్రం తాగమన్నారని వెంకటప్రసాద్ మీడియా ముందుకు వచ్చి తెలిపిన విషయం విధితమే. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో రాజమహేంద్రవరంలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారని తెలిపాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళనతో జిల్లా ఇన్‌ఛార్జి ఎస్‌పి సతీష్‌కుమార్ స్పందించారు. కడియం ఎస్‌ఐ శివాజీపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి విఆర్‌కి పంపించారు. ప్రస్తుతం చాగల్లులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ప్రసాద్ చికిత్స పొందుతున్నాడు. ఆయన్ని పలువురు నాయకులు పరామర్శించారు. ఘటనా తీరును అడికి తెలుసుకున్నారు. ఈ సందర్భంతా కెవిపిఎస్ జిల్ల కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడారు. బాధితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అతని కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో దళితులపై దాడులు, ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో దువ్వాడ రాజా, కె.బుద్దుడు, జి.సుబ్బారావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.










