Mar 15,2023 22:52

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి విద్యార్థి దశలో తొలి పబ్లిక్‌ పరీక్షలు పదో తరగతితోనే ప్రారంభమవుతాయి. విద్యార్థి భవిత కూడా ఈ పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. గతంలో ఆరు సబ్జెక్టుల్లో 11 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించకుడానే పదో తరగతి విద్యార్థులందర్నీ ప్రభుత్వం ఉత్తీర్ణులను చేసింది. గతేడాది సైన్స్‌ సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు, మిగిలిన ఐదు సబ్జెక్ట్‌లకు ఒక్కో పేపరు వంతున మొత్తం 7 పేపర్లకు పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది ప్రతి సబ్జెక్ట్‌కు ఒక పేపరు చొప్పున 6 పేపర్లు రాయాల్సి ఉంది. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల గడువు సమీపిస్తుండడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. తొలి పబ్లిక్‌ పరీక్షలు కావడంతో విద్యార్థులు ఒత్తిడికి గురికావడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. అధ్యయనంలో సబ్జక్టుల వారీగా శ్రద్ధ తీసుకోవటంతో మంచి ఫలితాలు సాధ్యం.
'టాప్‌'తో అనేక ప్రయోజనాలు
పాఠశాల విద్యాశాఖ 'టాప్‌' పేరుతో డైలీ టెస్ట్‌లు నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఈ టెస్ట్‌ల నిర్వహణతో ఆరు రోజుల్లో రెండు ఛాప్టర్‌లు పూర్తవుతాయి. ఏడో రోజున ఆ రెండు ఛాప్టర్‌లపై మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. దీనివల్ల గణితంలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. గతంలో ఇచ్చే అర మార్కు బిట్‌లకు ఒక మార్కు ఇవ్వడం వల్ల విద్యార్థులు 12 మార్కులను స్కోరు చేసే వీలుంది. వత్తాలు, త్రిభుజాలు, స్పర్శ రేఖలపై 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వాస్తవ సంఖ్యల ఛాప్టర్‌ ద్వారా 8 మార్కులను సులువుగా సాధించవచ్చు. గ్రాఫ్‌ పేపర్‌లో మూలాలు కనుగొనుట ద్వారా 8 మార్కులు పొందవచ్చు.
సబ్జక్టుల వారీగా అవగాహన అవసరం
పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి. ఇంగ్లీష్‌లో బయోగ్రాఫికల్‌ స్కెచ్‌లు రాసేటప్పుడు వరుసక్రమం పాటించాలి. కాంప్రెన్సిషివ్‌ (పాసేజ్‌లు)ను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకుంటే సమాధానాలు రాసే వీలుంది. అప్లికేషన్‌ మెథడ్‌లో ఉండే ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చదవాలి. లేదంటే తప్పులు రాసే అవకాశం ఉంది. క్రియేటివ్‌ రైటింగ్‌(సజనాత్మకత) రాసేటప్పుడు కాన్వర్జేషన్‌, లెటర్‌ రైటింగ్‌, ప్రశ్నల తయారీ(డబ్ల్యూహెచ్‌ క్వశ్చన్‌) సరిగా నింపితే మంచి మార్కులు వస్తాయి. ప్రశ్నాపత్రంలో చిత్రాలను బాగా పరిశీలించి.. అందుకు తగిన సమాధానం రాయాలి. పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించి సన్నద్ధమైతే.. ప్రయోజనం ఉంటుంది. సైన్స్‌లో అప్రమత్తత తప్పనిసరి సామాన్య శాస్త్రాన్ని.. ఫిజికల్‌, బయలాజికల్‌ సైన్స్‌గా విభజించి ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తారు. గతేడాది వరకు సైన్స్‌ పరీక్షకు రెండు పేపర్లు ఉండేవి. ఈ ఏడాది మాత్రం ఒకే పేపర్‌. మొదటి గంటన్నర ఫిజికల్‌ సైన్స్‌కు, చివరి గంటన్నర బయలాజికల్‌ సైన్స్‌కు విభజిస్తారు. ప్రశ్నాపత్రం మాత్రం ఒకటే. వేర్వేరుగా సమాధాన పత్రాలు ఇస్తారు. సమాధాన పత్రాలు రాసేటప్పుడు పొరపాటు జరిగితే ఆ విద్యార్థికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది.
సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ను అద్యయనం చేయాలి ఇలా..
సాంఘికశాస్త్రాన్ని.. జాగ్రఫీ, ఎకనామిక్స్‌ ఒక పార్ట్‌గా, హిస్టరీ, సివిక్స్‌ రెండో పార్ట్‌గా విభజించి చదవాలి. బార్‌ గ్రాఫ్స్‌, పై డయాగ్రమ్స్‌, టైమ్‌లైన్‌ చార్ట్‌లను సరిగా అర్థం చేసుకుంటే 8 నుంచి 12 వరకు మార్కులు పొందవచ్చు. భారతీయ భౌగోళిక స్వరూపాలు, శీతోష్ణస్థితి, గ్లోబలైజేషన్‌, సమతుల్య అభివద్ధి ఛాప్టర్‌ల నుంచి 8 మార్కుల ప్రశ్నలు వస్తుంటాయి. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు దాని ప్రభావం, భారత రాజ్యాంగం, జాతీయోద్యమం, సామాజిక ఉద్యమాలు, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం అనే అంశాల నుంచి 8 మార్కులు ప్రశ్నలు తరుచూ వస్తుంటాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కలిపి 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల వద్ద వేడెక్కుతుంది, ఆవిరవుతుంది ఈ తేడాలను అడుగుతుంటారు. అయస్కాంత బలరేఖల డైరెక్షన్‌ తప్పుగా ఇచ్చి వాటిని సరిచేయమంటుంటారు. రసాయన ప్రయోగాల్లో ఎలాంటి వాయువులు వస్తాయన్న ప్రశ్నలు వస్తుంటాయి. విద్యార్థులు తప్పనిసరిగా డయా గ్రమ్‌ను రోజుకు రెండు వంతున ప్రాక్టీస్‌ చేయాలి. ప్రమాణాలు తప్పులు రాయడం వల్ల విద్యార్థులు కొద్దిగా మార్కులు కోల్పోతున్నారు. దీనిని సరిచేసుకుని స్పష్టంగా రాస్తే 100శాతం మార్కులు స్కోర్‌ చేయవచ్చు.