ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ప్రజా పోరాటాల వారధి, కార్మిక నాయకుడు కొరటాల సత్యనారాయణను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం నాయకులు పిలుపు నిచ్చారు. నగరంలోని పేపర్ మిల్లు సిఐటియు కార్యాలయంలో ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో కొరటాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే కొరటాల సత్యనారాయణ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని, తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించారని, వ్యవసాయ కార్మికుల కూలి పెంపు పోరాటాలు, కార్మిక సంఘాల ఏర్పాటు చేసి కార్మిక హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నాయన్నారు. మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న తీరును తిప్పికొడుతూప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో సిపిఎం నాయకులు బి.పూర్ణంరాజు, సిఐటియు నాయకులు లవ కుమార్, సత్తిరాజు, తదితరులు పాల్గొన్నారు










