ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నేడు నగరంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేసి పలు పాఠశాలను సందర్శించారు. ఆర్యాపురం నన్నయ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను సందర్శించి 5వ తరగతి విద్యార్థుల వర్క్ బుక్స్‌ను పరిశీలించారు. 8వ తరగతిలో బైజూస్ టాబ్ కంటెంట్ గురించి ప్రశ్నించారు. ఉపాధ్యాయులు బైజూస్ కంటెంట్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సీతంపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులందరూ యూనిఫారం ధరించి రావడాన్ని ప్రశంసించారు. అర్బన్ పరిధి పాఠశాలలో నూరు శాతం జివికె కిట్లు సరఫరా జరగడంపై డిఇఒ ఎస్.అబ్రహాం, రేంజ్ డిఐ దిలీప్ కుమార్‌ను అభినందించారు. జగనన్న విద్యా కానుక కిట్లు నాణ్యతగా లేవని వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువైందన్నారు. తుమ్మలావలోని సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. టాయిలెట్స్, నాడు-నేడు పనులు, పాఠశాల పరిసర ప్రాంతాలను, నిర్వహణ పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్‌కుమార్, విద్యా సంచాలకులు నాగమణి, డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఎం.తిరుమల దాస్ పాల్గొన్నారు.










