Aug 03,2023 00:04

సమావేశంలో మాట్లాడుతున్న పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ ఆదిశేషయ్య

ప్రజాశక్తి - గోపాలపురం
పొగాకు పంటను పరిమితి మించి వేయరాదని పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ ఎం.ఆదిశేషయ్య అన్నారు. బుధవారం గోపాలపురం టుబాకో బోర్డులో రైతులతో పొగాకు పంట నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని వేలం నిర్వహణ అధికారి అమూల్‌ డి.శ్యామ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశేషయ్య మాట్లాడుతూ పొగాకు పంట అనుమతుల మేరకు మాత్రమే వేయాలన్నారు. మునుపు ఎన్నడూ లేనివిధంగా అత్యధిక ధరలు ఈ ఏడాది పొగాకు లభించిందన్నారు. దీంతో పొగాకు వేసేందుకు ఎక్కువ ంది రైతులు చూస్తున్నారన్నారు. ఈ ఏడాది 42 మిలియన్‌ కేజీలు పొగాకు అనుమతి ఇచ్చారని తెలిపారు. రైతులు పరిమితి మించి తోటలు వేశారని చెప్పారు. ప్రతి బేరన్‌కు 3500 కేజీలు పొగాకు కొనుగోలుకు అనుమతి ఉంటుందన్నారు. పరిమితి దాటితే కేజీకి రూ.5 పెనాల్టీ పడుతుందని తెలిపారు. కర్ణాటకలో వర్షాలు కారణంగా పొగాకు పంటలు దిగుబడి తగ్గడంతో కొరత ఏర్పడిందని అందుచేత పొగాకు కొనుగోళ్లు పరిమితి దాటిన వాటికీ పెనాల్టీ లేకుండా కొనుగోళ్లు జరిపామన్నారు. ఈ ఏడాది పెనాల్టీ లేకుండా 55 మిలియన్‌ కేజీల వరకు పొగాకు కొనుగోలు చేసేందుకు అనుమతులు లభించాయని తెలిపారు. పంట నియంత్రణ పాటిస్తూ నాణ్యమైన పొగాకు పండించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ గ్రేడ్‌ ఆఫీసర్‌ హేమస్మిత, ఇల్లూరి రాంబాబు, శ్రీనివాసరెడ్డి, రైతులు పాల్గొన్నారు.