ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, నిడదవోలు ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుందని ఎపి కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ధ్వజమెత్తారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐలకు నష్టం చేకూరేలా వాటి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిన అదానీ సంస్థపై వచ్చిన ఆర్థిక ఆరోపణలపై విచారణ చేయకుండా ఇంకా వారికి కొమ్ముకాయడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం మెయిన్‌రోడ్‌లో ఉన్న ఎల్‌ఐసి కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. బిజెపి, అదానీకి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలోనే పెద్దఎత్తున మనీ లాండరింగ్ జరుగుతోందని దీని వల్ల దేశానికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుందని హెచ్చరిస్తూ వస్తున్నారన్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక అన్ని విషయాలనూ బహిర్గతం చేసిందని, కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు దేశ సంపదను దోచిపెడుతోందని అన్నారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐలో పేద, మధ్య తరగతి ప్రజలు దాచుకున్న సొమ్మును అక్రమంగా మళ్లించడం వల్ల చాలా కుటుంబాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. అదానీ గ్రూప్ అక్రమ వ్యాపారాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాలేపల్లి మురళీధర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సోడదాసి మార్టిన్ లూధర్, వడయార్, జ్యేష్ట సతీష్‌బాబు, ముళ్ల మాధవ్, బెజవాడ రంగారావు పాల్గొన్నారు. నిడదవోలులో ఎల్‌ఐసి ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పెద్దిరెడ్డి సుబ్బారావు మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి చిన్నం మురళీకష్ణ, జిల్లా కార్యదర్శి అగర్వాల్ హీరాలాల్, పట్టణ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు, జివివి. సత్యనారాయణ, కొణిజేటి వెంకటనారాయణ, హుస్సేన్ జహ, పుచ్చకాయల వరప్రసాద్, షేక్ జిలానీ, అధికారుల బలరాం, కాకి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.










