May 16,2023 00:02

ప్రజాశక్తి-గోపాలపురం ప్రభుత్వ పాఠశాలలు అభివద్ధికి సిఎం వైఎస్‌.జగన్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడమే అందుకు నిదర్శనమని సర్పంచ్‌ గోళ్ల దాండియా అన్నారు. సోమవారం మండలంలోని వేళ్లచింతలగూడెం పంచాయతీ పరిధిలో బడిబాట ర్యాలీ, ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ గ్రామ సర్పంచ్‌ గోళ్ళ దండియా, ఎంపిటిసి సనమండ్ర లాజరు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ దండియా మాట్లాడుతూ ప్రభుత్వం మనబడి, నాడు నేడు, జగనన్న విద్యా కానుక కిట్లు, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీష్‌ మీడియం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అనేక వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపడుతోందన్నారు. కార్పొరేట్‌ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు. పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే మంచి ర్యాంకులు సాధించారన్నారు. ప్రజలందరూ పిల్లలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కె.సాంబమూర్తి, హెచ్‌ఎం ఎన్‌సిహెచ్‌.రత్నకుమారి, మహిళా పోలీస్‌ లలిత, ఉపాధ్యాయులు, హిదయతుల్లా, సూర్య చంద్రం, వెంకటేశ్వరరావు, సిఆర్‌పిలు నాగరాజు, లక్ష్మణ్‌, సుబ్రహ్మణ్యం, అంగన్‌శాడీ టీచర్‌ కమల కుమారి, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.