May 18,2023 23:07

భూమిని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

ప్రజాశక్తి - గోపాలపురం
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తహశీల్దార్‌ బి.రవీంద్రనాథ్‌ హెచ్చరించారు. దొండపూడి పంచాయతీ పరిధిలోని సాగిపాడు శివారు శ్మశానం భూమి ఆక్రమణకు గురైంది. దీంతో ఆక్రమణ దారుని నుంచి రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని పంచాయతీకి అప్పగించారు. సాగిపాడు శివారులో 79 /1 సర్వే నెంబరులో 3.96 ఎకరాల శ్మశానం భూమిని తణుకు వేములయ్య ఆక్రమించుకుని సాగు చేస్తున్నాడు. 2012లో ఈ భూమికి పట్టా ఉందని, ఈ భూమి తనదేనంటూ 2019లో హైకోర్టును ఆశ్రయించాడు. అదే గ్రామానికి చెందిన దాట్ల నారాయణరాజు శ్మశానం ఆక్రమణకు గురైందని, దీన్ని పంచాయతీకి అప్పగించాలని 2020లో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు జెసి ఈ భూమిని పరిశీలించారు. విచారణ చేపట్టారు. ఈ భూపట్టాకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఎటువంటి వివరాలు లేవని, నకిలీ పట్టాగా అధికారులు గుర్తించారు. దీంతో న్యాయస్థానం ఆదేశాలు అనుసారం తహశీల్దార్‌ బి.రవీంద్రనాథ్‌ తన సిబ్బంది, పోలీసు సహాయంతో భూమిని స్వాధీనం చేసుకుని పంచాయతీకి అప్పగించారు.