పోస్టల్ ఉద్యోగ సంఘాల
గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలి
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
తపాల శాఖను ప్రయివేటీకరణ చేయకుండా పోరాటాలు చేస్తున్న జాతీయ తపాలా ఉద్యోగుల సమాఖ్య(ఎన్‌ఎఫ్‌పిఇ), అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం(ఎఐపిఇయుపి) గుర్తింపు రద్దు ఆర్డరును వెంటనే వెనక్కి తీసుకోవాలని సంఘం రాజమండ్రి డివిజన్ కార్యదర్శి బి.కొండబాబు కోరారు. తపాల ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దును వ్యతిరేకిస్తూ స్థానిక రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద మధ్యతరగతి, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ, కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్.మూర్తి మాట్లాడారు. కేంద్రం తెచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమానికి ఆర్థిక సాయం చేశారనే కారణంగా ఈ రెండు యూనియన్ల గుర్తింపును రద్దు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాల అణచివేత చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం యూనియన్ల రద్దుకు పూనుకుందని విమర్శించారు. ఎల్‌ఐసి ఎంప్లాయీస్ యూనియన్ సౌత్ జోనల్ అధ్యక్షులు పి.సతీష్ మాట్లాడుతు స్వాతంత్య్రానికి ముందే తపాలా ఉద్యోగ సంఘాలు హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేయన్నారు. అదే స్ఫూర్తితో నేటి ప్రభుత్వ నియంతృత్వ పోకడలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు లక్ష్మీపతి మాట్లాడుతూ 80 శాతం ఉద్యోగులు సభ్యులుగా ఉన్న ఈ రెండు యూనియన్ల గుర్తింపు రద్దు చేయడం అన్యాయమన్నారు. దీన్ని ఐక్యంగా ఎదుర్కొనాలన్నారు. తపాలా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.రామలింగేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన కాలంలో తపాలా ఉద్యోగ సంఘాలు ఎన్నో పోరాటాలు చేశాయన్నారు. అదే విధంగా గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమించాలన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుబంధంగా ఉన్న ఒక గుర్తింపు లేని ఉద్యోగ సంఘం ఇచ్చిన పిర్యాదు మేరకు రెండు యూనియన్ల గుర్తింపు రద్దు చేయడం కక్ష్యసాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు విజరుకుమార్ మాట్లాడుతూ 2014 నుంచి ఉద్యోగ, కార్మిక సంఘాలను అణచివేసే కుట్ర జరుగుతుందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ యూనియన్ నాయకులు సతీష్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందన్నారు. తపాలా ఉద్యోగుల పోరాటానికి ఇన్సూరెన్స్, బ్యాంక్, బిఎస్‌ఎన్‌ఎల్, రైల్వే, కార్మిక యూనియన్ల మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తపాలా యూనియన్ ప్రెసిడెంట్ యుజి.ప్రకాష్, తపాలా ఉద్యోగ సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.










