సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
పోలవరం ప్రాజెక్టు నీటి సామర్థ్యం తగ్గించే ఆలోచన మానుకుని పూర్తిస్థాయి 45.72 మీటర్ల నీటిమట్టంతో నిర్మించాలంటూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. దీని నిర్మాణం పూర్తికాకపోగా సామర్థ్యం తగ్గించే కుట్ర జరుగుతుందన్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడకపోవడం తగదన్నారు. మోడీ ప్రభుత్వం పోలవరంపై రోజుకొక షరతు విధిస్తూ నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మోడీ, జగన్ ఇరువురు కలిసి రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలో అన్ని పార్టీలను ఏకం చేసి పోరాడాలన్నారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి.కొండలరావు , నిడదవోలు సిపిఐ కార్యదర్శి ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న సిపిఐ నాయకులు










