తిరుమలాయపాలెం దళిత నాయకులపై
కేసులు ఎత్తివేయాలి
రాజమహేంద్రవరంలో అభివృద్ధి పనులపై
శ్వేతపత్రం విడుదల చేయాలి
విలేకర్ల సమావేశంలో సిపిఎం జిల్లా
కార్యదర్శి అరుణ్ డిమాండ్
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
పోలవరం నిర్వాసితుల పోరుకేక పేరుతో నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు సంఘీభావం తెలపాలని, గోకవరం మండలం తిరుమలాయపాలెం ఘటన నేపథ్యంలో దళిత నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, రాజమహేంద్రవరం నగరంలో జరుగుతున్న అభివద్ధి పనులపై సమగ్ర వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బహుళ ప్రయోజనాలతో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్నారు. కాని నిర్వాసితులను మరిచారన్నారు. లక్షా అరువేల ఆరు కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అవుతున్నారని తెలిపారు. అయితే నేటికి 14 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం పనులు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయన్నారు. మిగిలిన 98 వేల కుటుంబాలు, 2.5 లక్షల జనాభాకు ఎప్పుడు పునరావాసం పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా స్పీల్ వే, గేట్లు, ఎగువ, దిగువ కాపర్ డామ్‌లు, డయా ఫ్రం వాల్ నిర్మించారన్నారు. కాని పునవాసం విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం పోరాడకుండా మోడీ ప్రభుత్వంతో జతకట్టి నిర్వాసితులను గోదావరిలో ముంచుతుందని విమర్శించారు. 2022 వరదలతో కాంటూరు లెక్కలు తప్పు అని తేలిపోయాయన్నారు. ముంపు ప్రాంత ప్రజలు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. దీని కోంస సిపిఎం ఆధ్వర్యంలో నిర్వాసితులు పోరుకేక పేరుతో మహా పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఈ పాదయాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వాన వెయ్యిమంది యువతీ, యువకులు 15 రోజులు పాటు నెల్లిపాక గ్రామం నుండి విజయవాడ వరకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. పాదయాత్రకు విశేషమైన ఆదరణ ప్రజల నుంచి వస్తుందన్నారు. పోలవరం నిర్వాసితుల పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరారు.
గోకవరం మండలం తిరుమలాయపాలెం వివాదంలో అధికార యంత్రాంగం సరైన పద్ధతి అవలంబించలేదన్నారు. అంబేద్కర్ విగ్రహం దళిత వాడల్లోనే నిర్మించాలా? అని ప్రశ్నించారు. ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అర్ధ రాత్రి తొలగించారన్నారు. రెండు వందల మంది పోలీసులను మొహరించి ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న దళిత నాయకులని అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండించారు. కలెక్టర్‌ను కలిసి జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరినా పోలీసుల తీరులో ఏ మాత్రం మార్పు లేదన్నారు. గ్రామంలో బాధితులను పరామర్శించడానికి, సహకారం అందించడానికి వెళ్తున్న దళిత నాయకులు, వామపక్ష నాయకులను పోలీసులు అడ్డగించి తప్పుడు కేసులు పెట్టారన్నారు. వెంటనే దళిత నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి అదే స్థలంలో ప్రభుత్వ అధికారులే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజమహేంద్రవరం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర వివరాలతో మున్సిపల్ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలని అరుణ్ డిమాండ్ చేశారు. అందుకు కారణం నగరంలో ప్రజలు 2022-2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.100 కోట్లు పన్నుల రూపంలో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెల్లించారని తెలిపారు. నగరంలో సుందరీకరణ పేరుతో రోడ్డు మధ్యలో డివైడర్లు, ఫుట్ పాత్‌పై రాళ్లు వేస్తున్నారని, ఒక వీధిలో హ్యాపీ స్ట్రీట్ ఏర్పాటు చేశారన్నారు. కాని ప్రజలకు కనీస వసతులైన పారిశుధ్యం, రోడ్లు, తాగునీరు వంటివి సక్రమంగా లేవని విమర్శించారు. పనుల్లో ప్రాధాన్యతను పాటించకుండా ప్రజల ధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. సుందరీకరణకు ఖర్చు పెడుతున్న నిధులు ఎంపీవా, కార్పొరేషన్‌వా, లేక రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక గ్రాంటా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. పనులు జరుగుతున్న చోట ఎక్కడ వివరాలు తెలిపే బోర్డులు లేవన్నారు. చిన్న పాటి వర్షానికి రోడ్లు జలమయం అవుతున్నాయని, తక్షణం ఆ సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, సిపిఎం సీనియర్ నాయకులు ఎస్‌ఎస్.మూర్తి, ఐ.సుబ్రహ్మణ్యం, బి.పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు.










