Jun 28,2023 23:35

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో జ్వరాల కలవరం మొదలైంది. గత వారం రోజులుగా వాతావరణం మారిన విషయం విదితమే. వేసవి తాపం నుంచి వర్షాలు స్వాంతన కల్పించినప్పటికీ జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు పల్లెలలో రోగి నాడి పట్టి కారణమేంటో తెలుసుకునేవారు. రోగి చెప్పిన లక్షణాలను బట్టి మందులిచ్చేవారు. అవి వాడినా ఫలితం కనిపించకపోతే పరీక్షలకు పంపేవారు. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆర్‌ఎంపి వైద్యులు సైతం ముందుగా పరీక్ష అనే ప్రిఫర్‌ చేస్తున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరమే మందులు రాస్తున్నారు. దీన్నే అవకాశంగా మార్చుకుని కొన్ని ల్యాబ్‌ల నిర్వాహకులు అర్హతలేని టెక్నీషియన్లతో పరీక్షలు చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్యులతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 20 నుంచి 30 శాతం కమీషన్లు ఇస్తూ అడ్డగోలు ఫీజులు గుంజుతున్నారు. మరి కొంతమంది పరీక్షల అనంతరం రిపోర్టులు ఇవ్వకుండానే సెల్‌ ఫోన్లకు టెక్స్ట్‌ మెసేజ్‌లు పంపించి అవే రిపోర్టులు అంటూ బిల్లులు వసూలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల హెచ్చరికలను సైతం పట్టించు కోవడం లేదు.
ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తత తప్పనిసరి
జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న డెంగ్యూ జ్వరం ఎడిస్‌ ఈజిప్ట్‌ అనే దోమ కాటు వల్ల వస్తున్నది. దీన్ని 'బ్రేక్‌ బోన్‌ ఫీవర్‌' అని కూడా పిలుస్తుంటారు. డెంగ్యూ బారిన పడిన వారిలో మూడు రోజులకు మించి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, తీవ్రఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. డెంగ్యూ లైక్‌ ఫీవర్స్‌లోనూ ఇంచుమించుగా ఇవే లక్షణాలే ఉంటున్నాయి. డెంగ్యూ తరువాత ఎక్కువగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరహా బాధితుల్లో తీవ్రమైన చలిజ్వరం, కండరాల నొప్పి, చెమలు పట్టడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. చికున్‌గున్యా బారిన పడిన వారిలోనూ జ్వరంతోపాటు తీవ్రమైన కండరాల నొప్పి ఉంటుంది.
ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్న ల్యాబ్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లో మాత్రమే ల్యాబ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాల పూర్తిగా బేఖాతరు చేస్తూ అర్హత లేని వారితో పరీక్షలు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగస్టిక్‌ సెంటర్లలో మౌలిక వసతులు లేకపోవడం వీరికి కలిసి వస్తోంది. ప్రైవేటు సెంటర్లలో కొద్దిగా అనుభవం ఉన్న టెక్నీషియన్లతోనే నిర్వాహకులు పరీక్షలు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అర్హతలేని టెక్నీషియన్లతో పరీక్షలు చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఇచ్చిన రిపోర్టుకు, మరో సెంటర్‌ ఇచ్చే రిపోర్టుకు తేడా ఉంటోంది. రాజమహేంద్రవరంలో ఇలాంటి సంఘటనలు అనేకం బయటపడ్డా పట్టించుకునేవారు కరువయ్యారు.