ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ పొగాకు వాడకానికి అందరూ దూరంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పిలుపు నిచ్చారు. బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సిగరెట్, ఇతర పొగాకు సంబందిత ఉత్పత్తులు వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వల్ల ఏటా 80 లక్షల మంది చనిపోతున్నారన్నారు. సిగరెట్ వల్ల గొంతు క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారన్నారు. జాయింట్ కలెక్టరు ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ పొగాకు ఏ రూపంలో వాడినా అందులో ఉన్న నాలుగు వేల రకాల రసాయనాలు మనిషి అరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయన్నారు. మున్సిపల్ కమిషనర్ కె.దినేశ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పరిధిలో ఉన్న దుకాణాలలో సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మకూడ దన్నారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమించినట్లు గుర్తిస్తే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలుత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డాక్టర్ కె.వెంకటేశ్వర రావు, డాక్టర్ రాజీవ్, డాక్టర్ ఎం.రాజకుమారి, డాక్టర్ లక్ష్మీ దేవి పాల్గొన్నారు.
గోకవరం మండలంలోని ఇటికాయలపల్లిలో కొత్తపల్లి పిహెచ్‌సి ఎంపిహెచ్‌ఇం వైఎస్.రాయుడు ఆధ్వర్యాన పొగాకు దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ నాగేశ్వకరరావు, ఆశా వర్కర్లు గ్రామప్రజలు పాల్గొన్నారు










