Jul 04,2023 00:51

ప్రజాశక్తి- రాజమహేం ద్రవరం ప్రతినిధి ఎట్టకేలకు తొలకరి పలకరించింది. ఏరువాక పౌర్ణమి వచ్చింది వెళ్లింది, మృగశిర కార్తెలో సగం గడిచిపోయింది, జులై రెండో తేదీ దాటిన నైరుతి రుతుపవనాల పలకరించలేదని నిరాశ చెందిన రైతన్నలను సోమవారం వర్షం పలకరించింది. రోహిణి కార్తె అనంతరం విత్తనం నాటితే ఈ సమయంలో మొక్క మొలుస్తుందని, ఆ మొక్కలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి చీడ పీడలను తట్టుకోవడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా వస్తాయని రైతులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో రోహిణి కార్తె ప్రారంభం కాగానే జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతుల పొడి దుక్కుల్లోనే అక్కడక్కడా వాణిజ్య పంటలు విత్తనాలు వేశారు. మరోవైపు వరి సాగు చేసే రైతన్నలు నార్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. ఎప్పటి లాగే వర్షాలు పడతాయన్న ఆశతో ఎదురు చూశారు. కానీ రుతుపవనాల రాక ఆలస్యమై విత్తనాలు, వరి నార్లు మట్టిలోనే పొట్లిపోతుండటంతో రైతులు అందోళన చెందారు. గోదావరి ఆయకట్టులో కాలువలకు విడుదల చేసిన నీరు కొంత ఊరట ఇచ్చింది. మెట్ట ప్రాంతాలలో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అత్యధిక మండలాల్లో కురిసిన వర్షం రైతన్నలతోపాటు పట్టణ ప్రజానీకానికి ఊరటనిచ్చింది.
2.17 లక్షల ఎకరాల్లో వరి సాగు
జిల్లావ్యాప్తంగా వానాకాలం 2.17 లక్షల ఎకరాల్లో సాగయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు 1,625 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. పంటలు చేతొకొచ్చే దశలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే వానాకాలం పంట సాగును నెల రోజుల ముందుకు తీసుకొచ్చి.. జూన్‌ మొదటి వారంలోని వరినాట్లు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్టోబర్‌ నెలాఖరుకు వరి కోతలు వచ్చి అకాల వర్షాలు, గోదావరి వరదల నుంచి కాపాడుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా పంట కాలాన్ని ముందుకు తేవాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు జూన్‌ ఒకటో తేదీ నుంచి సాగునీరు విడుదల చేశారు. ప్రతిరోజు మూడు డెల్టాలకు సుమారు 8000 క్యూసెక్కుల సాగునీటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌బికెలు, సహకార సంఘాల ద్వారా భూసారానికి అవసరమైన జీలుగులు, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచారు. తొలకరి జల్లుల అనంతరం భూముల అనుకూలంగా ఉంటాయని రుతుపవనాల రాక కోసం రైతు ఎదురుచూశారు.
వ్యవసాయ శాఖ సంసిద్ధం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ సంసిద్ధమయింది. ముందస్తు సాగుకు రైతులకు అవసరాలు తగ్గట్లుగా 28 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులను అందుబాటులోకి తెచ్చారు. ఆర్‌బికెల్లో 2100 టన్నులు, ప్రైవేట్‌ దుకాణాలు సొసైటీల్లో 20 వేల టన్నులు అందుబాటులో ఉంచారు. కౌలు కార్డుల రెన్యువల్స్‌ ప్రక్రియ చేపట్టారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందస్తు సాగు ఆలస్యమైంది. ఐదేళ్లుగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తరచూ అల్పపీడన ద్రోణులు ఏర్పడి భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తోడవుతున్నాయి. వెరసి గోదావరి వరదల రూపంలో జిల్లా రైతాంగాన్ని నష్టాలపాలు చేస్తున్నాయి. వేసవికాలంలో కాలువల ఆధునీకరణ పూడికతీత వంటి పనులలో ప్రభుత్వ చిత్తశుద్ధి లేమి ప్రధాన కారణంగా మారుతుంది. పంట పొలాల్లో కురిసిన వర్షాలు రైలు ద్వారా దిగువకు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో పొలాల్లో నీళ్లు నిలబడి అకాల వర్షాలకు తుపాన్లకు రైతన్నలు నష్టపోతున్నారు.