Jul 27,2023 00:20

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి
గోదావరి నది వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలోనూ వర్షాలు తోడవటంతో మళ్లీ వరద తీవ్రత పెరుగుతోంది. గత వారం రో జులుగా కొనసాగుతున్న వరద పరివాహక ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు 46.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఉదయం 7 గంటలకు 39.40 అడుగుల నీటిమట్టం నమోదు కాగా క్రమ క్రమంగా వరద ఉదృతి పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు 41.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటలకు 43.50 అడుగులకు చేరటంతో మొదటి ప్రమాద హెచ్చ రికను అధికారులు జారీ చేశారు. రాత్రి రెండో ప్రమా దహెచ్చరిక జారీచేశారు దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దిగువన ఉన్న తూర్పుగోదావరి, కోనసీమలలోని పరివాహక ప్రాంతాల్లోనూ డేంజర్‌బెల్స్‌ మోగుతున్నాయి. భద్రాచలం నుంచి వస్తున్న ప్రవాహాన్ని అంచనా వేసుకుని ఇక్కడి జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సాయత్రం 6 గంటలకు సర్‌ ఆర్దర్‌ కాటన్‌ బ్యారేజీ వద్ద బ్యారేజీ వద్ద 10.60 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో అక్కడి 175 గేట్ల ద్వారా మిగులు జలాలు 8.16లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రానికి విడుదల చేస్తున్నారు.తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వలకు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని పాత బ్రిడ్జి వద్ద 13.90మీటర్లు నీటి మట్టం ఉంది. రాబోయే 24గంటలో వరద ఉధృతి పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కోనసీమలో డేంజర్‌ బెల్స్‌
గోదావరి వరద ఉదృతి మళ్లీ పెరగటంతో కోనసీమలోని నదీ పరివాహక ప్రాంతాల్లో డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. కనకాయ లంక కాజ్‌వే నీట మునిగింది. వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా ఎగువ రాష్ట్రాల్లో వర్షాల నేపధ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమవుతున్నారు. అయినవిల్లి మండలంలోని కోటిపల్లి , అయినవిల్లి లంక, పి గన్నవరం మండలంలోని గంటి పెద్దపూడి ఫెర్రీ, ఊడుమూడి లంక, బూరుగులంక ,అరిగెల వారిపేట, మామిడికుదురు మండలంలో అప్పనపల్లి, , పాశర్లపూడి గ్రామాలను అధికారులు సందర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాటన్‌ బ్యారేజీ వద్ద 11.75 అడుగుల ఎత్తున నీటిమట్టం చేరితే దిగువకు 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అధికారుల గణాంకాల ప్రకారం కొనసీమ జిల్లాల్లో 7 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 13.75 అడుగులకుచేరితే 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఫలితంగా 13 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. అదే బ్యారేజీ వద్ద 17.75 అడుగులకు నీటిమట్టం చేరితే 17 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దీంతో 12 గ్రామాలపై ప్రభావం ఉంటుంది. పలు కాజ్‌వేలు ముంపునకు గురవటంతో రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తనున్నాయి. తూర్పుగోదావరిలో సీతానగరం, కొవ్వూరులో గోదావరి గట్లతో పాటు, కోనసీమజిల్లాలో నాగుల్లంక, తొండవరం, వాకలగరువు గట్లు బలహీనంగా ఉన్నాయి. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో గత మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణాల్లోని పలు ప్రధాన కూడళ్లు జలమయం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల సాగు భూములు ముంపునకు గురయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో సగటు 36.1 ఎంఎం వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో సగటు వర్షపాతం 32.4 ఎంఎం నమోదుకాగా అత్యధికంగా సీతానగరంలో 55 ఎంఎం వర్షపాతం నమోదైంది. రంగంపేట మం డలంలో అత్యల్పంగా 21.2 ఎంఎం వర్షపాతం నమోదైంది. కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌లో సగటు వర్షపాతం 40.2 ఎంఎం నమోదు కాగా, తాళ్లపూడిలో అత్యధికంగా 84.6 ఎంఎం వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నిడదవోలులో 10.8 వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా తాళ్లపూడిలో అత్యల్పంగా నిడదవోలులో వర్షపాతం నమోదైంది.