ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్
రాష్ట్రంలో పేదరికం నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని హోం శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు మండలం మద్దూరు, ధర్మవరం గ్రామాల్లో నిర్వహించిన 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల సమాచారాన్ని సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లకు వివరించారు. ప్రజలతో మాట్లాడారు. వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలపై పత్రిపక్షం అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీనే సంక్షోభంలో ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమాజంలో అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్రం పయనిస్తోందని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజల్లోకి నేరుగా వెళ్లి చెప్పగలుగుతున్నామన్నారు. చెప్పుకునేందుకు ఏమీ లేక ప్రతిపక్షం అసత్య ప్రచారాలకు తెరలేపిందన్నారు. అబద్దపు ప్రచారాలను తిప్పికొడుతూ జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరంగా చెప్పాలన్నారు. గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు చిత్త శుద్ధితో పనిచేయాలన్నారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 'జగనన్నే మా భవిష్యత్తు' స్టిక్కర్లను ప్రతి ఇంటికి వారి అనుమతి తీసుకున్న తర్వాతనే అతికించాలని, అభ్యంతరం ఉంటే అతికించరాదని తెలిపారు. సర్వే పూర్తి అయిన తర్వాత 82960 82960 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గ పర్యటనకు విచ్చేస్తున్న జగన్‌కు ఘన స్వాగతం పలకాలని మంత్రి తానేటి వనిత కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.










