ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
పేదల సొంతింటి కల సాకారం చేయడమే సిఎం జగన్ ధ్యేయమని వైసిపి పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం నగరంలోని ఆనం కళా కేంద్రంలో 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా పథకం' కింద సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆర్థిక సహాయ మంజూరు పత్రాలను ఎంపీ భరత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 223మంది లబ్ధిదారులకు ఈ పత్రాలను ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో లబ్ధిదారునికి రూ.1లక్షా80వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాయని తెలిపారు. అలాగే గహనిర్మాణానికి అవసరమైన ఇసుక, ఐరన్, సిమెంట్ తదితర మెటీరియల్ ను సబ్సిడీ పై అందజేసి సహకరించనున్నట్టు తెలిపారు. సిఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలలో అర్హులైన పేదలు 32 లక్షల మందికి సొంత గూడు కల్పించాలని సిఎం జగన్ ఎంతో పట్టుదలతో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సమర్థవంతంగా అర్హులైన పేదలందరికీ అందుతున్నాయంటే దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కారణమని అన్నారు. ప్రస్తుతం మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ళను నిర్మించుకోవాలని, దశల వారీగా వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని ఎంపీ భరత్ తెలిపారు. ఆయా వార్డు ఇన్చార్జులు దగ్గరుండి లబ్ధిదారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ పి.సత్యవేణి, జిల్లా గహనిర్మాణ శాఖ అధికారి జి.పరశురామ్, హౌసింగ్ డిఇఇ కె.సూరిబాబు, హౌసింగ్ ఎఇ కె.ఉమాశంకర్, రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పాలిక శ్రీను, మార్గాని సురేష్, మింది నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.










