Jul 05,2023 22:51

బహుమతి అందిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడంలో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సిబ్బందిది కీలక పాత్ర అని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పడి 45 వసంతాలు పూర్తి అయిన సందర్బంగా బుధవారం స్థానిక అటవీశాఖ కార్తీక వనంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆవిర్బావ దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పేదవానికీ సొంతింటి కల సాకారం చేసిందన్నారు. లబ్ధిదారుల స్థలంలో ఇంటిని నిర్మించి అందించడంలో హౌసింగ్‌ శాఖపై ఎంతో భాద్యత ఉందన్నారు. ఆ మేరకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్‌ను 1979 జులై 5న స్థాపించిందన్నారు. నేటికి 45 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో 68 వేల గహనిర్మాణాల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 21 వేలకు పైగా ఇళ్లను నిర్మించామన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధికమించి హౌసింగ్‌ అధికారులు మంచిగా పని చేస్తున్నారన్నారు. జిల్లా హౌసింగ్‌ అధికారి జి.పరశురాం మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ స్థాపన నుంచి ఎన్నో విజయాలను సాధిస్తూ రాష్ట్రంలోని అత్యున్నత నైపుణ్యం గల ఇంఇనీరింగ్‌ వ్యవస్థతో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. హిబ్‌ టెక్‌ సంస్థ ద్వారా సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించి నైపుణ్యాలను పెంపొందించడంలో ముందంజలో ఉందన్నారు. ఈ సందర్బంగా పలువురు హౌసింగ్‌ అధికారులు,సిబ్బంది రక్తదానం చేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఇఇ సోములు, డిఇఇలు, ఎఇలు, వర్కు ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.