కొనసాగుతున్న అసైన్డ్ భూముల సర్వే
వివరాల వెల్లడికి అధికారుల వెనకడుగు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
పేదలను, దళితులను ఉద్దరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల తరబడి వారు సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను దోచుకునేందుకు కుట్రలకు తెరలేపింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికే ఎత్తేసిన ప్రభుత్వం అక్కడక్కడా పేదలు, దళితుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి అసైన్డ్ భూములపైనా కన్నేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 9/22 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా గత 20 సంవత్సరాలుగా అసైన్డ్ భూములను సాగు చేస్తున్న వాస్తవ లబ్ధిదారులకు, వారసులకు ఆ భూమిపై పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పింది. అయితే లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాయాల్లో గ్రామాల వారీగా ప్రకటిస్తామని వెల్లడించింది. అసైన్డ్ భూముల వివరాలు, వాస్తవ లబ్ధిదారులు, ప్రస్తుతం ఎవరి సాగులో ఉంది అనే వివరాలను వెల్లడించి పాదర్శకత పాటిస్తామని ప్రకటనలు చేసింది. అయితే ఆచరణలో పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రజా పోరాటాల నేపథ్యంలో దళితులు, గిరిజనులకు పాలక ప్రభుత్వాలు అసైన్డ్ భూములు కేటాయించిన విషయం విధితమే. ఈ భూములు క్రయ, విక్రయాలకు అనుమతి లేకుండా 9/77 చట్టం గత కొన్ని దశాబ్ధాలుగా రక్షణగా ఉంది. గ్రామాల్లో సాగుకోసం భూముల పత్రాలను పెద్ద రైతులు, వ్యాపారుల తనఖాకు పెట్టుకుని సాగుదారులకు అప్పులు ఇచ్చారు. ఆ ఆప్పులు తీర్చలేక అత్యధిక మంది భూమికి దూరమేనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ భూములు పూర్తిగా తమ సొంతం చేసుకునేందుకు పెద్దలు పావులు కదుపుతున్నారు.
అత్యధిక భూములు పెద్దల చేతుల్లోనే..
జిల్లాలో గ్రామాల వారీగా భూముల లభ్యతను బట్టి 20 సెంట్ల నుంచి 2.50 ఎకరాల వరకూ పేదలకు అసైన్డ్ భూములను గత ప్రభుత్వాలు అందజేశాయి. తాజాగా 2023లోనూ 1,311 మంది సాగుదారులకు 1043 ఎకరాల భూమిని ప్రభుత్వం అందజేసింది. కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌లో 470.30 ఎకరాలు గా, కాగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో 569.064 ఎకరాలను అందజేసింది. 2003కి పూర్వం పంపిణీ చేసిన
భూములు ప్రస్తుతం గ్రామాల్లో పెద్ద రైతులు, అగ్రకులాలు, వ్యాపారుల చేతుల్లో ఉన్నట్లు అనేక ఉదాహరణలున్నాయి. ఉదాహరణకు నల్లజర్ల మండలంలోని పోతిరెడ్డి పాలెంలోనూ, పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామాల్లో అసైన్డ్ భూమి లబ్ధిదారులు తమ భూములకు పూర్తిగా దూరమయ్యారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీతో జిల్లావ్యాప్తంగా ఇటీవల సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. మరో 15 రోజుల్లో ముగుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 272 గ్రామాలు ఉన్నాయి. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో 123 కాగా, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 149 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఇప్పటి వరకూ 202 గ్రామాలు పూర్తి చేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లాల వారీగా ప్రభుత్వ, అసైన్డ్, భూధాన్ తదితర భూముల జాబితా విభజన జరిగింది. ఈ జాబితాను కోరినప్పటికీ అధికారులు వెల్లడించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓ జిల్లా స్థాయి అధికారి ఇటీవల ఓ సమావేశం నిర్వహించి ఎట్టిపరిస్థితుల్లోనూ అసైన్డ్ వివరాలు వెల్లడించకూడదని చెప్పినట్లు తెలుస్తోంది.
అసైన్డ్ భూముల జాబితాపై గోప్యత
జిల్లాలోని కొవ్వూరు, రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో సుమారు 20 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు అంచనా. ఈ భూములు వాస్తవ సాగుదారులు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నట్లు రైతు, దళిత, గిరిన సంఘాల నాయకులు చెబుతున్నారు. పభుత్వ తాజా నిర్ణయంతో త్వరలోనే హక్కు పత్రాలు జారీ కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పెద్దలు ఇప్పటికే వాస్తవ లబ్ధిదారులతోనూ, వారి వారసులతోనూ మంతనాలు ప్రారంభించారు. వారి పేర్లపై తాత్కాలికగా హక్కు పత్రాలు జారీ చేయించి అనంతరం తమ పేర్లకు మార్పులు చేసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి వరకూ ప్రోత్సాహం లభిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ కారణంతోనే పారదర్శకత పాటించాల్సిన స్థానంలో గోప్యత కొనసాగుతోంది.
భూములను పెద్దలకు కట్టబెట్టేందుకే...
పేదల భూములను పెద్దలకు అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. వైసిపి ప్రభుత్వం అందుకోసమే 9/23 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ చట్ట సవరణ పేదలను ఆస్థికి దూరం చేయనుంది. అనేక పోరాటాల ఫలితంగా దళతులకు, గిరిజనులకు అసైన్డ్ భూములు లభించాయి. అసైన్డ్ భూముల లబ్ధిదారుల కుటుంబాల మహిళలకు పట్టాలు ఇవ్వాలి. రెండున్నర ఎకరాలలోపు అసైన్డ్ భూములు కొన్న పేద రైతులకు రక్షణ కల్పించాలి.
- జువ్వల రాంబాబు,
కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు










