Mar 02,2023 21:59

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గరిష్ఠ స్థాయిలో మార్కులు సాధించేందుకు ప్రత్యేకంగా టార్గెట్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రాం (టాప్‌)ను విద్యాశాఖ అమలు చేస్తోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధన లక్ష్యంగా ఈ టాప్‌ను రూపొందించారు. విద్యార్థుల్లో ఆందోళనను పోగొట్టేందుకు వారికి మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. వాటిల్లో వారు చేసిన తప్పులను గుర్తించి తరగతి గదిలో వివరిస్తారు. మళ్లీ పరీక్షల్లో ఆ తప్పులు పునరావతం కాకుండా చూడటం ప్రధాన లక్ష్యం. అందుకోసం పదో తరగతి విద్యార్థులకు టైం టేబుల్‌లో కూడా మార్పులు చేశారు. ఆయా సబ్జెక్టులు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్‌లో కవర్‌ అయ్యేలా ప్రణాళికను రూపొం దించారు. ప్రతిరోజూ ఉదయం 8.30 ఉంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యార్థులకు పీరియడ్లు కేటా యించారు.
ప్రతిరోజూ పరీక్షలు
టాప్‌ విధానంలో విద్యార్థులకు ప్రతిరోజూ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రెండు లాంగ్‌ పీరియడ్లలో మొదటి 45 నిమిషాలు పరీక్షకు సన్నద్ధం చేసి రెండో 45 నిమిషాలలో పరీక్ష నిర్వహిస్తారు. వీటి కోసం విద్యార్థులు ప్రత్యేకంగా నోట్‌ బుక్‌లు పెట్టి పరీక్షలను వాటిల్లోనే రాయాలి. సంబంధిత సబ్జెక్టు టీచర్లు ఆ సమాధానాలను మూల్యాంకనం చేసి విద్యార్థులు చేసిన తప్పులను గుర్తిస్తారు. వాటిని వివరించి అవి పునరావతం కాకుండా చూస్తారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
నెలాఖరు వరకూ కొనసాగనున్న కార్యక్రమం
పబ్లిక్‌ పరీక్షలకు కసరత్తుగా ఈ నెల 8నుంచి 16 వరకు ప్రి ఫైనల్‌ నిర్వహిస్తారు. పదవ తరగతి విద్యార్థులకు ఎస్‌ఎ -4 మినహాయించి ప్రి ఫైనల్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష విద్యార్థులకు పబ్లిక్‌ తరహాలో మొత్తం సిలబస్‌పై ఉంటుంది. టాప్‌ కార్యక్రమం మార్చి 31 వరకు కొనసాగుతుంది. కరోనా వైరస్‌ విజృంభణ ఫలితంగా అమలు చేసిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో గతేడాది ఫలితాల్లో జిల్లా వెనుకబడిన విషయం విదితమే. ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించటమే లక్ష్యంగా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.