May 07,2023 00:51

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి పదవ తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 70.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యాశాఖ శనివారం పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన విషయం విదితమే. 2022-2023 విద్యా సంవత్సరంలో జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 22,465 మంది హాజరవగా, 15,798 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు మెరుగైన ఉత్తీర్ణతను నమోదు చేసుకున్నారు. జిల్లాలో 11,334 మంది బాలురకు గాను 7,641 మంది (67.42 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 11,131 మంది హాజరు కాగా 8,157 (73.28 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 11,410 మంది ప్రథమ స్థానంలో, 2,875 మంది ద్వితీయ స్థానంలో, 1513 మంది తతీయ స్థానంలో నిలిచారు. ఉత్తీర్ణత సాధించని వారి కోసం జూన్‌ 2 నుంచి 10 వరకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు కోసం మే 7 నుంచి మే 17 వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజులు సంబంధిత స్కూల్‌ హెచ్‌ఎంలకు చెల్లించాలి. రూ.50 అపరాధ రుసుం చెల్లించి మే 18 నుంచి 22 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. ఉత్తీర్ణత సాధించలేక పోయిన విద్యార్థులు సప్లిమెంటరి పరీక్షకు హాజరైతే రెగ్యులర్‌ విద్యార్థుల మాదిరిగానే సర్టిఫికేట్‌ జారీ చేస్తామని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఇఒ అబ్రహాం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సూచించారు.
విద్యార్థులకు కలెక్టర్‌ శుభాకాంక్షలు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌
పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత శుభాకాంక్షలు తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన 10 వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలను డిఇఒ ఎస్‌.అబ్రహాం కలెక్టర్‌కు నివేదించారు. ఉత్తీర్ణత సాధించని వారి కోసం జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ప్రణాళికాబద్ధంగా విద్యా సంవత్సరం
రానున్న నూతన విద్యా సంవత్సరాన్ని ప్రణాళికాబద్ధంగాప్రారంభించాలని అర్బన్‌ రేంజ్‌ డిఐ ఆఫ్‌ స్కూల్స్‌ బి.దిలీప్‌ కుమార్‌ హెచ్‌ఎంలను ఆదేశించారు. స్థానిక ఎస్‌కెవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంలు, మెప్మా ఎపిఎం, సిఆర్‌పిలు, ఎడ్యుకేషన్‌ సెక్రటరీలు, వార్డు ఎమినిటీ సెక్రటరీలతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా విద్యాశాఖ అధికారులతో జరిపిన టెలికాన్ఫెరెన్స్‌లో అంశాల ఆధారంగా రూపొందించిన కార్యాచరణను వివరించారు. రానున్న విద్యా సంవత్సరానికి హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చేపట్టాల్సిన కార్యక్రమాలను సమగ్రంగా వివరించారు. పాఠశాల ఆవాస ప్రాంతాల్లో బడి ఈడు గల పిల్లలను ముందుగా 8వ తేదీ నుండి 12వ తేదీ వరకూ సెన్సస్‌ రిజిస్టర్‌లను అప్డేట్‌ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌పిలు జయంతి శాస్త్రి, జె.శ్రీనివాసరావు, పబ్బినీడి ప్రసాద్‌, కుమారి, కోటేశ్వరి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
రాజమహేంద్రవరం నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మున్సిపల్‌ పాఠశాలలు 12, ప్రభుత్వ పాఠశాలలు 3 కలిపి మొత్తం 15 స్కూళ్లలోని 104 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. గోపాలపురం మండలంలో 49.8 ఉత్తీర్ణత శాతం సాధించారు. మండలంలో జగన్నాధపురంచ జెడ్‌పి హెచ్‌ఎస్‌ స్కూల్‌ విద్యార్థిని పుప్పుల హర్షవర్ధని 577 మార్కులతో ప్రథమ స్థానం సాధించినట్టు ఎంఇఒ జి.శ్రీనివాసరావు తెలిపారు.
మండలంలో ప్రైవేట్‌ కళాశాలలు అత్యధిక మార్కులు సాధించి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నాయని పాఠశాలలు యాజమాన్యాలు తెలిపాయి. సెయింట్‌ మేరీస్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థిని నిడదవోలు నవ్య వెంకట సాయి 586 మార్కులతో ప్రథమ స్థానం, గోపాలపురం శార్వాణి రెసిడెన్షియల్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థిని దాసుపర్తి ఆనంద్‌ 582 మార్కులతో ద్వితీయ స్థానం, వేలచింతలగూడెం సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌కు చెందిన పాముల అభినయశ్రీ 577 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు.
కడియం మండలంలో 75.5 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ఎంఇఒ వి.లజపతిరారు తెలిపారు. మండలంలోని 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 792 మంది పరీక్షకు హాజరు కాగా, 598 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. సీతానగరం మండలంలో 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు హాజరైన 671 విద్యార్థులకు గాను 451 మంది ఉత్తీర్ణత సాధించారు. చాగల్లు మండలంలో 7 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొత్తం 467 మంది విద్యార్థులు 246 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు ఎంఇఒ వి.ఖాదర్‌ బాబు తెలిపారు. గోకవరం మండలంలో 49 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు ఎంఇఒ బి.గైరమ్మ తెలిపారు. మండలంలో 7 జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు రెండు ఎపి రెసిడెన్షియల్‌ పాఠశాలకు 725 మంది విద్యార్థులకు గాను 357 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
వేలివెన్ను అన్నపూర్ణ విద్యార్థుల ప్రతిభ
ఉండ్రాజవరం అన్నపూర్ణ విద్యార్తులు మంచి ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల డైరెక్టర్‌ నందిగం భాస్కరరామయ్య తెలిపారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్ధులను, ఉపాధ్యాయులను కరస్పాండెంటు నందిగం వెంకట సీతారామయ్య, హైస్కూలు ఇన్‌ఛార్జి అల్లూరి శ్రీనివాస్‌ అభినందించారు. వేలివెన్ను శశి విద్యార్ధులు మంచి ప్రతిభ కనబరచి, రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచారని శశి విద్యా సంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ తెలిపారు. 600 మార్కులకు గాను పుట్టా సాయి శ్రావణి 597 మార్కులతో రాష్ట్రంలో అగ్రస్థానం సాధించిందన్నారు. 594 మార్కులతో సాయి మధుప్రియ, చిట్టిది రిషిధర్‌ సాయి 592 మార్కులు సాధించారన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను వైస్‌ చైర్మన్‌ లక్ష్మీ సుప్రియ అభినందించారు. మండలంలో 55.47 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు ఎంఇఒ పివిఎస్‌.నాగరాజు తెలిపారు. తాళ్లపూడిలోని మాంటిస్సోరి ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ విద్యార్థులు నూటికి నూరు శాతం విజయం సాధించినట్టు కరస్పాండెంట్‌ వివి.అనీష్‌ తెలిపారు. ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారని తెలిపారు. మండలంలోని 12 ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల నుండి 532 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 334 మంది ఉత్తీర్ణులైనట్టు ఎంఇఒ వివేకానంద తెలిపారు. దేవరపల్లి ఉత్తమ ఫలితాలు సాధించిన దేవరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అభినందించారు. పార్టీ కార్యాలయంలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంత ఘనతలు సాధించడం ఏ ప్రభుత్వంలో లేదని ఈ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యిందని అన్నారు. రాజానగరం మండలంలో 584 మార్కులతో హర్షవర్ధన్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్ధి నల్లమోలు శ్రీరామ్‌ ప్రథమ స్థానం, 581 మార్కులతో దివ్య పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్ధి నీతా ఆదిత్య రామ్‌ ద్వితీయ స్థానం, హర్షవర్ధన్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్ధి కె.హర్షిత 570 మార్కులతో తతీయ స్థానం సాధించారు. రాజమహేంద్రవరం రూరల్‌ కస్తూర్బా గాంధీ బాలికోన్న పాఠశాల విద్యార్థిని ఎండి.కరీమున్నీసా బేగం అత్యధికంగా 564 మార్కులు సాధించింది. రెండో అత్యధిక మార్కులను కె.లాస్య ప్రవల్లిక 563 మార్కులను సాధించింది. కొవ్వూరు రూరల్‌ వాడపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థి కునపురెడ్డి సత్య అనూష దుర్గ 585 మార్కులతో ప్రథమ స్థానం, ప్రైవేట్‌ విద్యాసంస్థలైన చైతన్య పాఠశాలకు చెందిన నెక్కంటి శ్రీవర్ష 594 మార్క్‌లు, నారాయణ పాఠశాలకు చెందిన వలివేటి జాస్మతి 590 మార్కులు సాధించారు.