ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేసి గురువారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.రాంబాబు, ఎన్.రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను అందించాలన్నారు. అయితే ఈ సంవత్సరం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం ఇవ్వటం లేదని విద్యార్థులే బయట కొనుగోలు చేసుకోవాలని తెలియజేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేని ప్రభుత్వం విద్యాభివద్ధికి ఏ రకంగా కషి చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం వారి నిర్ణయాన్ని మార్చుకోవాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు అందరితో ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు జోసెఫ్, మరియు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కనకారావు, భవాని తదితరులు పాల్గొన్నారు.










