ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విటి జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.రాం బాబు, ఎన్.రాజా మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలన్నింటికీ రాష్ట్ర ప్రభు త్వమే పాఠ్య పుస్తకాలను అందించాలన్నారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాలను ఇవ్వట్లేదని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన ద్వారా తెలిపారన్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఒక సర్క్యులర్‌ను విడుదల చేసిందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేని ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎలా కృషి చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చు కోవాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు జోసెఫ్, ఎస్‌ఎఫ్‌ఐ విటి కాలేజ్ నాయకులు రాజేష్, దేవి, భాష తదితరులు పాల్గొన్నారు.










