May 27,2023 23:29

ప్రజాశక్తి-రాజానగరం మండలంలోని పాలచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని, హెడ్‌ నర్స్‌ను సస్పెండ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం సమయంలో 10 గంటల నుండి 11 గంటల మధ్యలో ఎక్కువ మంది రోగులు ఉంటారని, ముగ్గురు, నలుగురు ఉండడం ఏమిటని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. విధుల్లో నిరక్ష్యంగా ఉన్నారని వైద్యాధికారి డాక్టర్‌ టి.బెనెడిక్ట్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని, హెడ్‌ నర్స్‌ ఎస్‌.గంగాభవానిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. వీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి అందిస్తున్న వైద్య సేవల వివరాలు రికార్డ్‌ చేయాలని సూచించారు. ఏ నెలలో ఎంతమంది గర్భిణులు డెలివరీ తేదీలతో సమగ్ర సమాచారం పిహెచ్‌సి, సిహెచ్‌సిల్లో ఉండాలని ఆదేశించారు. ఈ బాధ్యత సంబంధిత డాక్టర్లదన్నారు. ఏప్రిల్‌ నెలలో 3 డెలివరీ లు అయ్యాయని సిబ్బంది తెలిపారు. మే నెలలో వివరాలు పరిశీలించి, జూన్‌, జూలై, ఆగష్టు సమాచారం మేరకు వారికి తగిన వైద్య సేవలు, మందులు అందించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. తొలుత కలెక్టర్‌ హౌసింగ్‌ లే అవుట్‌ను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న 37 ఇళ్లను పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన 16 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా ఇచ్చారని, ఇంకా నిర్మాణాలు చేపట్టాల్సిన 12 ఇళ్లను వెంటనే నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులకు అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా హౌసింగ్‌ అధికారి జి.పరశురామ్‌, తహశీల్దార్‌ ఎన్‌ఎస్‌.పవన్‌ కుమార్‌, విద్యుత్‌ శాఖ ఇఇ డేవిడ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ రవికుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.