Aug 09,2023 23:19

రాజకీయపార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ మాధవీలత
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఓటర్ల గుర్తింపు, నమోదులో రాజకీయ పార్టీలు కీలకపాత్ర పోషించి సహకరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌లో భాగంగా ఇంటింటా ఓటరు గుర్తింపు ప్రక్రియలో రాజకీయ పార్టీలు సహయకుల నియామకం చేపట్టి బిఎల్‌ఒతో అనుసంధానం చేయడం ద్వారా హేతుబద్ధత కలిగిన జాబితా తయారు చేయగలమని ఆమె అన్నారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం మధ్యాహ్నం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జెసి ఎన్‌.తేజ్‌భరత్‌, డిఆర్‌ఒ జి.నరసిం హులుతో కలిసి కలెక్టర్‌ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఓటరు జాబితా స్వచ్ఛలీకరణ నేపథ్యంలో బూత్‌ లెవల్‌ అధికారులు వారి పరిధిలోని ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి, ఓటర్లను గుర్తిస్తున్నార న్నారు. జూలై 21 నుంచి డోర్‌ టూ డోర్‌ సర్వే ఓటరు జాబితాను అనుసరించి తనిఖీ చేస్తామ న్నారు. ఈ ప్రక్రియలో ఫామ్‌లను భౌతికంగా తీసుకోవడం, ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేస్తామ న్నారు. ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాపై ఫిర్యాదు చేయడం కంటే ముందస్తుగానే రాజకీయ పార్టీలు చైతన్యం కలిగి, సమస్యలను తెలియజేస్తే ఎటువంటి తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేయొచ్చన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఫామ్‌- 6లు ఎనిమిది వేలు, ఫారమ్‌-7లు 7,501, ఫారం-4లు 9,221 స్వీకరించామన్నారు. మొత్తం 91,596 ఫారమ్స్‌లకు 49,974 సరిచేశామన్నారు. 2,474 తిరస్కరించామని తెలిపారు. ఇంకా 39,148 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. డోర్‌ టూ డోర్‌ ఓటరు గుర్తింపులో భాగంగా 211 మంది మరణించిన వారిని, 10 మంది ఇల్లు మారిన వారిని, 150 మంది డబ్బుల్‌ ఎంట్రీ ఉన్న వాటిని గుర్తించి తొలగించామన్నారు. పోలింగ్‌ కేంద్రాల రేషనైజేషన్‌ ప్రక్రియ లో భాగంగా 1500 పైబడి ఓటర్లు ఉన్న కేంద్రాలను, నివాస ప్రాంతానికి 2 కిలోమీటర్లు పైబడి దూరంలో ఉన్న ఓటర్ల కోసం తగిన ప్రతిపాదనలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నియోజక వర్గ స్థాయిలో ప్రతి మంగళవారం, జిల్లా స్థాయిలో ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆయా రాజకీయ పార్టీలు ఒక వ్యక్తిని శాశ్వత ప్రతినిధిగా నియమించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ జి.నరసింహులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పి.వర్మ, కె.విశ్వనాథరాజు, ఎస.సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.