Jun 14,2023 00:03

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, సీతానగరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయ మని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. దశాబ్ధాల కాలంగా చాలీచాలనీ వేతనాలతో భారంగా కాలం వెళ్ళదీస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో సిఎం జగన్‌ వెలుగులు నింపారన్నారు. మంగళవారం నగరంలోని విఎల్‌.పురం మార్గాని ఎస్టేట్స్‌ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ భరత్‌ను ఎపిఎన్‌జిఒ అసోసియేషన్‌ ప్రతినిధులు, కాంట్రాక్టు ఉద్యోగులు కలిసి కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్‌ మాట్లాడుతూ జగనన్న పాదయాత్ర సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులు తమ వెతలు చెప్పుకున్నారని, అధికారంలోకి వచ్చాక తప్పక మీ అందర్నీ క్రమబద్ధీకరిస్తానని మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీ కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పాలిక శ్రీను, ఎన్‌వి.శ్రీనివాస్‌, మార్గాని సురేష్‌, నక్కా శ్రీనాగేష్‌, ఎన్‌జిఒ అసోసియేషన్‌ నేతలు వైవివిఎస్‌ నాయుడు, సేవా ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. తమను పర్మినెంట్‌ చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలపడంతో మంగళవారం సీతానగరం ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతానగరం ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న 15 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ద్వారంపూడి రామకృష్ణ, వలవల వల్లి కస్య సత్తిబాబు, మునియ్య పాల్గొన్నారు.