-యుటిఎఫ్ నిరవధిక దీక్షలో నేతల పిలుపు
-ఒపిఎస్ సాధనకై యుటిఎఫ్ నిరవధిక దీక్ష ప్రారంభం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్‌కు పాత పెన్షన్ విధానాన్ని(ఒపిఎస్) అమలు చేసే పార్టీకే తమ ఓటును వేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి పిలుపునిచ్చారు. ఒపిఎస్ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నిరవధిక నిరాహార దీక్ష గురువారం నగరంలని యుటిఎఫ్ జిల్లా కార్యా లయం వద్ద ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ ఒపిఎస్‌పై రాజకీయ పార్టీలు తమ వైఖరిని రాబోయే ఎన్నికల్లోపు ప్రకటిం చాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ నినాదం ఒపిఎస్ మాత్రమేనని చాటి చెప్పాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్సనర్స్‌కు పిలుపునిచ్చారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్ మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని బిక్ష కాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్ విధానంలో ఉన్నారని చెప్పారు. సిపిఎస్ రద్దు చేస్తామని మాజీ సిఎం చంద్రబాబు ట్రక్కర్ కమిషన్ తీసుకొచ్చి అమలు చేయ లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తానన్న నాటి ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత సిఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్ల తర్వాత మాట మార్చారని విమర్శించారు. సిపిఎస్ రద్దు చేయకుండా జిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. దీనిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎటువంటి న్యాయం జరగదని చెప్పారు. సీనియర్ నాయకులు రెడ్డి వీరాస్వామి మాట్లాడుతూ పెన్షన్ కొనసాగితే రాష్ట్ర ఖజానా దివాలా తీస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదయోగ్యం కాదని చెబుతుందని, ప్రభుత్వ బూటకపు మాటలను యుటిఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ నుంచి ఒపిఎస్‌లోకి వచ్చాయని ఆయన గుర్తు చేశారు. జిల్లా అధ్యక్షులు పి.జయకర్ మాట్లాడుతూ డిఎస్‌సి-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో ఇచ్చినా అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే సిపిఎస్ అమలు తేదీ నాటికి రిక్రూట్మెంట్ విధానం పూర్తి అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఒపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సహాధ్యక్షురాలు పి. విజయ గౌరి మాట్లాడుతూ ఒపిఎస్ అమలు చేయాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయులు ఈ నెల 20న పాత తాలూకా కేంద్రాల్లో నిరాహార దీక్షలు ప్రారంభించి ఒపిఎస్‌ను సాధించే వరకూ కొనసాగించనున్నారని తెలిపారు. నిరవధిక దీక్షలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.జయకర్, ఉపాధ్యాక్షులు ఐ.రాంబాబు, జిల్లా సిపిఎస్ కన్వీనర్ కె.రమేష్, జిల్లా కార్యదర్శి ఎన్.రవి బాబు, రాష్ట్ర కౌన్సిలర్.ఎస్.అనిత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రాజేశ్వరి, సిపిఎస్ రాజమహేంద్రవరం టౌన్ బాధ్యులు ఇ.బాల సుంకయ్య కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్సులు శ్రీమణి వెంకటరమణ, ఎం.శ్రీనివాస్, ప్రకాశరావు, వెంకట రాముడు వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సంఘీభావంగా పాల్గొన్నారు










