ప్రజాశక్తి - రాజమహేంద్రవరం, కొవ్వూరు రూరల్
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఒపిఎస్‌ను కొనసాగించాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన నిరవధిక దీక్ష శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరాన్ని పిడిఎఫ్ ఎంఎల్‌సి షేక్‌సాబ్జి సందర్శించి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు సిపిఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించాలన్నారు. ప్రత్యామ్నాయం అంటూ తీసుకొచ్చిన జిపిఎస్ మరింత ప్రమాదకరమన్నారు. వెంటనే దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ డిఎస్‌సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరానికి వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు. సిఐటియు నాయకులు అరుణ్‌ణ దీక్షలో కొనసాగుతున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కొవ్వూరు రూరల్ ఆర్‌డిఒ కార్యాలయం వద్ద దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ విధానానికి బదులు ప్రభుత్వం జిపిఎస్ విధానాన్ని అమలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి ఉభయగోదావరి జిల్లాల ఎంఎల్‌సి షేక్ సాబ్జీ మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా జగన్ ఇచ్చిన హామీని, సిఎం అయిన తర్వాత అమలు చేయడం లేదన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేవరకు దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ శిబిరంలో నాయకులు ఎం.రవి, సిహెచ్.మనోహర్, ఆర్.సురేష్ కుమార్, రాజశేఖర్, డి.క్రాంతికుమార్, ఆర్.సురేష్ కుమార్, నాగేంద్రప్రసాద్, జాన్‌బాబు పాల్గొన్నారు సిఐటియు నాయకులు అరుణ్‌కుమార్, లవ కుమార్ తదితరులు మద్దతు తెలిపారు.










