Jan 28,2023 22:38

పునాది దశలోనే ఉన్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులు

ప్రజాశక్తి-గోకవరం
గోకవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గోకవరంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం నిమిత్తం రెండేళ్ల క్రితం రూ.1.50 కోట్లతో ఆసుపత్రి భవన నిర్మాణానికి జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు శంకుస్థాపన చేశారు. కాని పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి బిల్డింగ్‌ మొదటి అంతస్తును పూర్తి చేయాల్సి ఉంది. కాని ఇంక పనులు పునాది దశలోనే ఉన్నాయి. ఆసుపత్రి నిర్మాణంపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవిలత గోకవరం వచ్చి ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్టురు ఆసుపత్రి ఇంజనీరింగ్‌ సిబ్బందిని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జనవరి నెలాఖరు నాటికి ఆసుపత్రి మొదటి అంతస్తు స్లాబ్‌ వేసి అప్పగిస్తామని ఆ సమయంలో కాంట్రక్టర్‌ కలెక్టర్‌కు తెలిపారు. నెలాఖరు సమీపించినా నేటికీ నిర్మాణం పునాదుల్లోనే ఉంది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుందా? లేదా? అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగితే మండల కేంద్రమైన గోకవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, ఏజెన్సీకి సంబంధించి దేవీపట్నం, రంపచోడవరం, గంగవరం మండలాలకు చెందిన గిరిజనులకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టనట్టు వ్యవహరించడం వలేల ఆసుపత్రి పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి పనులు త్వరితగతిన సాగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.